Friday, November 22, 2024

AP: పోలవరంను ముంచింది జగనే… పూర్తి కావాలంటే మరో నాలుగేళ్లు.. చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును ముంచింది మాజీ సీఎం జగనేనని, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో నాలుగేళ్ల సమయం పడుతుందని ఏపీ చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు స్పిల్ వే పనులను ఆయన పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్ల సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనం అవడంతోనే ఆనాడు పోలవరం పనులు చేయగలిగామని చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభాన్ని ఎదుర్కొందన్నారు. పోలవరం ప్రాజెక్టుతో కోస్తాంధ్ర జిల్లాలకు నీరు లభిస్తోందని చెప్పారు. నదిని మళ్లించి కడుతున్న ప్రాజెక్టు అని.. చైనా త్రిగార్జెస్ ప్రాజెక్టు కంటే ఎక్కువ నీరు ఈ ప్రాజెక్ట్ స్పిల్ వే నుంచి విడుదలవుతుందని చెప్పారు. 2014-2019 మధ్య పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.

”గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది. ప్రాజెక్టుతో ఒక ఆట ఆడుకుంది. డయా ఫ్రమ్ వాల్‌ను నిర్మించకుండా మీన మేషాలు లెక్కలేశారు. మళ్లీ మొత్తం డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలంటే రూ. 997 కోట్లు కావాలి. నాలుగు చోట్ల డ్యామేజ్ అయింది. కాఫర్ డ్యామ్‌నూ నిర్లక్ష్యం చేశారు. కాఫర్ డ్యామ్ కింద ఇసుక దాదాపు 20 మీటర్ల పొడవు కొట్టుకుపోయింది. 150 మీటర్ల లోతు మేర ఇసుక వేసి ఫిల్ చేయాలి. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ పనులకు దాదాపు రూ. 2500 కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఉంటే 2020కే పూర్తి అయ్యేది. ఇప్పుడు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది. రాష్ట్రానికి జగన్ శాపంగా మారారు.” అని చంద్రబాబు విమర్శించారు.

- Advertisement -

‘వైఎస్ జగన్ రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. జగన్ అధికారంలోకి రాగానే రివర్స్ పనులు చేశారు. అధికారంలోకి రాగానే అన్ని ఏజెన్సీలను మార్చేశారు. ఆ రోజు ప్రశ్నించే పరిస్థితే లేదు. అధికారం ఉందని నేను మార్చేయగలను, కానీ అది కాదు కావాల్సింది. ప్రాజెక్టు పూర్తి చేయాలనేదే మా లక్ష్యం. ఫస్ట్ రివ్యూ చేశాం. ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. నిర్వాసితులనూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వాళ్లకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ప్రాజెక్టుకు నష్టం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టిన తర్వాత నలుగురు కేంద్రమంత్రులు మారారు. ఇప్పుడు ఐదో కేంద్రమంత్రి వచ్చారు.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement