శ్రీ సిటీ, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీలోని ఇసుజు మోటార్స్ ఇండియా ప్లాంట్‌లో తయారైన మొదటి ‘మూవర్’ (ఎం.ఓ.ఓ.డబ్ల్యూ.ఆర్) ఎగుమతి వాహనాన్ని మంగళవారం విడుదల చేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఇసుజు మోటార్స్ ఇండియా (ఐఎంఐ) మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ మిట్టల్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కిషిమోటో సమక్షంలో కేంద్ర కస్టమ్స్ అదనపు కమిషనర్ సాధు నరసింహారెడ్డి జెండా ఊపారు. ఇదే కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఎగుమతి వాహనాలు తయారయ్యే ‘మూవర్’ గోదామును లాంఛనంగా ఆవిష్కరించారు.
ఇసుజుకు శుభాకాంక్షలు తెలిపిన నరసింహారెడ్డి, మరో మైలురాయిని అధిగమించినందుకు ఇసుజు బృందానికి ధన్యవాదాలు తెలిపారు. మూవర్ పథకం గురించి వివరిస్తూ.. తయారీ సంస్థల ప్రయోజనాల కోసం దిగుమతి చేసుకున్న వస్తువులపై కస్టమ్స్ సుంకాలను తొలగిస్తూ భారత ప్రభుత్వ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సి బీ ఐ టి ) శాఖ ఈ పథకాన్ని ప్రారంభించిందని ఆయన చెప్పారు. తయారీ రంగంలో పోటీని అధిగమించడం, ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశాన్ని మార్చడం ఈ పథకం లక్ష్యంగా పేర్కొన్నారు.
రవీంద్ర సన్నారెడ్డి, మాట్లాడుతూ .. ఇసుజు మోటార్స్ ఇండియా తన మొట్టమొదటి కార్ల తయారీ ప్లాంట్ ను 2016లో ఆంధ్రప్రదేశ్ శ్రీసిటీలో ప్రారంభించడాన్ని గుర్తు చేస్తూ ప్లాంట్ స్థాపన మొదలై పలు మైలు రాళ్ళును అధిగమించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా స్థానికులకు 80 శాతం ఉపాధి కల్పించడం, ఉద్యోగ కల్పన ద్వారా ఈ ప్రాంత సామాజిక ఆర్థిక వృద్ధికి చూపుతున్న చొరవను ఆయన అభినందించారు.
ఐ ఎం ఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కిషిమోటో మాట్లాడుతూ, తమ సంస్థ ఎదుగుదలకు అద్భుత సహకారం అందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. జపాన్ కు చెందిన ఇసుజు మోటార్స్ ఇండియా దాని తయారీ యూనిట్. 50 వేల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో 1500 కోట్ల పెట్టుబడితో భారతదేశపు మొదటి లైఫ్‌స్టైల్ మరియు అడ్వెంచర్ పికప్ వాహనం ISUZU D-MAX V-Cross, వ్యక్తిగత వాహన విభాగంలో ప్రీమియం 7-సీటర్ SUV వాహనం ISUZU mu-X, రెగ్యులర్ క్యాబ్, వాణిజ్య విభాగం కోసం ISUZU D-MAX తయారు చేస్తుంది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 1500 కాగా, అందులో 18% మహిళా శ్రామిక శక్తి. ఉద్యోగుల సంఖ్యలో 80% మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారే.కావడం విశేషం