Saturday, November 23, 2024

సరికొత్త శకానికి నాంది పలికిన ఇస్రో.. తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం

సూళ్లూరుపేట (శ్రీహరికోట), ప్రభన్యూస్‌: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త శకానికి నాంది పలికింది. తొలిసారిగా ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టబోతుంది. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్ర రాజ్యాలకు ధీటుగా దూసుకుపోతున్న ఇస్రో, దేశీయంగా తయారు చేసిన తొలి ప్రైవేట్‌ రాకెట్‌ను రోదసిలోకి పంపనున్న నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు భారత్‌వైపు చూస్తున్నారు. తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగానికి శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగం షార్‌ వేదికగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరో స్పేస్‌ సంస్థ రూపొందించిన ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌ -ఎస్‌ ప్రయోగానికి ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. అన్ని సాంకేతిక అంశాలు సమకూరిన నేపథ్యంలో వాతావరణం అనుకూలిస్తే రేపు (శుక్రవారం) ఉదయం 11.30గంటలకు విక్రమ్‌ -ఎస్‌ రాకెట్‌ నింగిలో దూసుకెళ్లనుంది.

శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌)లోని సౌండ్‌ రాకెట్‌ క్లాంప్లెక్స్‌ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇందుకోసం షార్‌లో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అనే ప్రైవేటు సంస్థ అభివృద్ది చేసిన ఈ రాకెట్‌ దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ కావడం విశేషం. 6 మీటర్ల పొడవు, 545 కిలోల బరువు గల విక్రమ్‌ -ఎస్‌ రాకెట్‌ భూమికి 103 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్‌లో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. అక్కడి నుంచి తిరిగి సముద్రంలో శ్రీహరికోటకు 115.8 కిలోమీటర్ల దూరంలో పడిపోనుంది. మొత్తం ఈ ప్రయోగాన్ని 4.50 నిమిషాలలో పూర్తి చేసేలా శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టారు. ప్రైవేటు రాకెట్లను అంతరిక్షంలోకి పంపనున్న ఈ ప్రయోగంపై ఖగోళ ఔత్సాహికులలో ఆసక్తిని కలిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement