హైదరాబాద్ – భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ60ని ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 8.58గంటలకు కౌంట్ డాన్ ప్రారంభమైంది. ఈ రాకెట్ నేటి రాత్రి 9.58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే ఈ ప్రయోగ సమయంలో స్పల్ప మార్పు చేశారు శాస్త్రవేత్తలు. . 9:58కి బదులుగా 10:15కు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది.
ఇక పీఎస్ఎల్వీ-సీ60 ద్వారా స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి ఇస్రో పంపనుంది. ఈ జంట ఉపగ్రహాలకు ఛేజర్, టార్గెట్ అనే పేర్లను శాస్త్రవేత్తలు పెట్టారు. ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం, తదితర సేవలకు ఉపయోగపడనున్నాయని ఇస్రో వెల్లడించింది. అదేవిధంగా భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్-4లో, భారత్ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. డాకింగ్ సత్తా కలిగిన నాల్గో దేశంగా భారత్ అవతరిస్తుంది.