Tuesday, November 19, 2024

AP: రాష్ట్రంలో చట్టం అనేది ఉందా.. బోండా ఉమా మహేశ్వర రావు

పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న జగన్…
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిత్యం వేధింపులు..
కనీస నీతి న్యాయం పట్టని పోలీసు కమిషనర్..
రాళ్ల దాడిలో అమాయకులను బలి చేసే యత్నం
దుర్గారావు ఆచూకీ చెప్పండి..
సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే..

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : రాష్ట్రంలో అసలు చట్టం అనేది అమలు అవుతుందా అని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలవుతున్నా నిత్యం పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్ల దాడిలో అమాయకులను బలి చేస్తున్న పోలీసు కమిషనర్ కు కనీస నీతి, నిజాయితీ, న్యాయం నియమావళి లేదని ఆరోపించారు. విజయవాడలోని మొగల్రాజపురం ఆయన స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై సిబిఐ ఎంక్వయిరీ చేయాలని మొట్టమొదటగా డిమాండ్ చేసింది తానేనని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తుంద‌ని ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులు అందరూ కమిషనర్ పరిధిలోకి వెళతారనీ, కానీ మన రాష్ట్రంలో అలా జరగట్లేదన్నారు. పోలీసులు తనను నిత్యం వేధిస్తున్నారనీ చెప్పారు.

నిన్న తన ఆఫీస్ వ‌ద్ద‌కు 100మంది పోలీసులు వచ్చారనీ, మైనర్ ను తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారనీ, తాము చెప్పినట్టుగా 164 స్టేట్ మెంట్ ఇవ్వకపోతే మీ కొడుకు బయటకు రాడని ముద్దాయి సతీష్ తల్లి తండ్రిని భయపెట్టారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు సిగ్గుతో తల దించుకోవాలన్నారు. రాళ్ల దాడిలో తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి మైనర్ ను ఇరికించారన్నారు. సెంట్రల్ నియోజ‌కవర్గంలో ఉండే దుర్గారావు ఎక్కడ ఉన్నాడో ఇప్పటివరకు ఆచూకీ తెలియ రాలేదన్నారు. ఇంతవరకు కోర్టులో ఎందుకు ప్రవేశ పెట్టలేదని ఆయన పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని 24 గంటలలో జడ్జి ముందు ప్రవేశ పెట్టాలని తెలియదా అని అన్నారు. రాష్ట్రంలో చట్టం అనేది ఉందా అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోదా అని అన్నారు. మొదటి రోజే సీబీఐ ఎంక్వైరీ వేయమని మేమే అడిగామనీ, గవర్నర్ ను కలసి సీబీఐ ఎంక్వైరీ చేయమని అడిగినట్లు గుర్తు చేశారు. జగన్ తన వ్యవస్థలను ఇప్పటికీ తన గుప్పెట్లో పెట్టుకునీ, అందరిని ఆడిస్తున్నాడని విమర్శించారు. పోలీస్ కమిషనర్ కు కొంచమైనా నీతి, న్యాయం ఉండాలన్నారు. త‌నకోసం వడ్డెర గూడెం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. తెలంగాణలో జీ హుజూర్ ఆన్న నాయకులు ఇప్పుడు జైల్లో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. జూన్ 4 తర్వాత అందరి సంగతి చూస్తానని హెచ్చరించారు. తనను తప్పుడు కేసులో ఇరికించాలని అనుకొంటే వారిని ఊరికే వదిలిపెట్టనన్నారు. దుర్గారావును వివేకా లాగా ఏమైనా చేసే అవకాశం ఉందని అనుమాన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు బనాయిస్తే న్యాయ పోరాటం చేస్తానని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement