విజయవాడ, ప్రభన్యూస్ : విద్యాసంస్థల బస్సులు తరచు ప్రమాదాలకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఫిట్నెస్ లేకుండానే బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సీట్లకు మించి విద్యార్థులను ఎక్కించడంతో పాటు సరైన కండిషన్ లేకపోవడం ఆ బస్సులు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి ఉందంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నారు. ఎప్పుడైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు రవాణాశాఖాధికారుల పనితీరు చర్చనీయాంశమయ్యేది. అధికారుల అలసత్వం, పాఠశాలల యాజమానులు నిబంధనల ఉల్లంఘన కలిసి పాఠశాల బస్సుల ప్రమాద ఘటనలు జరిగేవి. యాజమాన్యాల వత్తిడికి లొంగి రవాణాధికారులు స్కూల్ బస్సు నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా ఫిట్నెస్ సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారనే అరోపణలున్నాయి.
స్కూల్ బస్సులో విద్యా సంస్థల పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామా వివరాలు రాసి ఉండాలి. దాంతో పాటు స్కూల్ బస్సు నెంబర్ నమోదు చేయాలి. డ్రైవర్ వివరాలు, లైసెన్సు, బ్యాడ్జి వివరాలు, బీమా, ట్యాక్స్‌లతో పాటు వాహన వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. బస్సులో ఉండే అటెండర్ వివరాలు కూడా నమోదు చేయాలి. డ్రైవర్, అటెండర్‌గా పనిచేసేవారికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. బస్సులో ఎంతమంది పిల్లలు రాకపోకలు సాగిస్తున్నారనే వివరాలు నమోదు చేయాలి. 18 సీట్లలోపు స్కూల్ వ్యాన్, ఆర్డినరీ బస్సు నడిపే డ్రైవర్‌కు ఎల్ఎంవీ ట్రాన్స్‌పోర్టు లైసెన్సుతో పాటు బ్యాడ్జి నెంబరు ఉండాలి. సుమారు 20 సీట్లు దాటిన పెద్ద బస్సులను హెచ్‌టీవీ లైసెన్సు కలిగి ఉండి బ్యాడ్జి నెంబర్ కలిగి ఉండాలి. వాహనాల సామర్థ్యం బట్టి డ్రైవర్‌ను ఎంపిక చేసుకోవాలి. లైసెన్సు ఉందా, లేదా పరిశీలించడానికి లాగిన్ అయ్యి డ్రైవర్ నెంబర్ పరిశీలిస్తే పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.
60 సంవత్సరాలలోపు వయసున్న వ్యక్తిని మాత్రమే డ్రైవర్‌గా నియమించాలి. డ్రైవర్ యొక్క ఆరోగ్య పరిస్థ్థితి తెలిపే హెల్త్ కార్డు ఉండాలి. ఆ డ్రైవర్‌కు ప్రతి 3 నెలలకు ఒకసారి యాజమాన్యాలే సొంత ఖర్చుతో వైద్య పరీక్షలు నిర్వహించాలి. డ్రైవర్లను నియమించే ముందు వారి డ్రైవింగ్ లైసెన్సు యొక్క నిజనిర్థాణ కొరకు సంబంధిత ఆర్టిఐ కార్యాలయాలలో చూపించాలి. ఆదే తరహా వాహనం డ్రైవింగ్ లో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి అయిఉండాలి. డ్రైవర్ల నియామకంలో పేరెంట్స్ కమిటి వాళ్ళతో నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, పేరెంట్స్ కమిటీ వాళ్లు ప్రతి నెలా బస్సు యొక్క స్థితిగతులను పరిశీలించి, వాటి వివరాలను ఒక రిజిష్టర్‌లో పొందుపరచాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital