న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు సహా ఏ ఒక్కటీ సాధించలేని ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని టీడీపీ ధ్వజమెత్తింది. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన టీడీపీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ హామీ ఇచ్చిన విషయాన్ని ఎంపీ రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ప్రజల దగ్గర నుంచి డబ్బెలా లాక్కోవాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి జగన్ పని చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ రంగాన్ని జగన్ ప్రభుత్వం కుదేలు చేసిందని, ఇబ్బడిముబ్బడిగా కరెంటు ఛార్జీలు పెంచారని విమర్శించారు. ఇంత భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు చేసే మేలు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కరెంట్ ఛార్జీల రూపంలోనే ప్రజలపై 42 వేల కోట్ల భారం మోపారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రంలోనూ, ఢిల్లీలోనూ వైసీపీ నిర్యీర్యం చేస్తోందని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై దొంగ నాటకాలు కట్టిపెట్టి, అందరం కలిసి రాజీనామాలు చేద్దామని ముందుకు రండని రామ్మోహన్ సవాల్ విసిరారు. రాష్ట్ర సమస్యలు, అంశాలను టీడీపీ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో లేవనెత్తుతుంటే వైఎస్సార్సీపీ ఎంపీలు అసభ్య పదజాలం వాడుతూ అడ్డు తగులుతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అమరావతి రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను, కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో అన్నీ కాకమ్మ కథలు చెప్తోందని అన్నారు. రాజధానిలో పెట్టిన పది వేల కోట్ల ఖర్చు, ఆస్తుల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం పక్కన పెట్టిందని, రాజధానిపై హైకోర్టు తీర్పును అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా? ఈ విషయాన్ని ఎందుకు అఫిడవిట్‌లో పొందుపరచలేదని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న రాజకీయ నేతలు, బాస్‌లను సంతృప్తి పరిచేందుకు అధికారులు వేసిన అఫిడవిట్ అదని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో చేపట్టిన అన్ని పనులను పక్కన పెట్టేశారన్న కనకమేడల, రాజకీయ బాస్‌లకు అధికారులు అడుగులకు మడుగులు ఒత్తినంత కాలం ఇలాంటి పరిస్థితులు, పరిణామాలే ఉంటాయని ఎద్దేవా చేశారు. అఫిడవిట్ దాఖలు కోర్టు ధిక్కరణ అని ఆయన అభిప్రయాపడ్డారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లాలే గానీ కోర్టులను తప్పుదోవ పట్టించరాదని కనకమేడల రవీంద్ర కుమార్ సూచించారు.