ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఉమ్మడి రాష్ట్రం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. సీఎంగా వైఎస్సార్ హయాంలో మంత్రి పదవులు నిర్వహించారు ఆనం. ఉన్నతమైన ఆర్థిక శాఖ నిర్వహించి వైఎస్ రాజశేఖర్రెడ్డి నుంచి మెప్పు పొందారు. అయితే.. ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్ తనయుడు అయిన జగన్మోహన్రెడ్డి హయాంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు చుక్కెదురవుతోంది. ఈ మధ్య ఆనం రామనారాయణరెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసేలా చేసిన వ్యాఖ్యలే ఆయనను పార్టీకి దూరం చేస్తున్నాయా? అన్న వాదనాలు వినిపిస్తున్నాయి.
అయితే.. ఇదే కారణం కావచ్చు అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ‘‘ఏం ముఖం పెట్టుకుని, ఏం పనులు చేశామని ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి” అంటూ ప్రభుత్వాన్ని ఆనం రామనారాయణరెడ్డి నిలదీశారు. దీంతో ఆయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా ఇవ్వాల (మంగళవారం) సస్పెన్షన్ చేస్తూ వైసీపీ ఆదేశాలు జారీ చేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, పార్టీ వర్గాల నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన రాలేదని కొంతమంది చెబుతున్నారు. ఇక.. ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి జిల్లాకు చెందిన వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవ్వాల ఆ నియోజకవర్గం బాధ్యతలను మాత్రమే ఆనం రామనారాయణరెడ్డి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.