అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో జలయజ్ఞం పథకం ద్వారా నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టులను నవరత్నా ల వలెనే ప్రాధాన్యతనిచ్చి మరింత త్వరి తగతిన నిర్మాణ పనులు పూర్తి చేయా లని ప్రభుత్వం యోచిస్తుంది. ఆ దిశగా అవస రమైన ప్రణాళికలను కూడా రూపొంది ంచింది. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ , ఉత్తరాంధ్ర పరిధిలోని వివిధ ప్రాజెక్టుల ను నవరత్నాలతో పూర్తి చేయాలని లక్ష్యం గా నిర్ణయించుకుంది. అందులో భాగం గానే 2023 -24 వార్షిక బడ్జెట్లో జగన్ సర్కార్ సరికొత్త ప్రతిపాదనను రూపొం దించింది. అందుకోసం సుమారు 22 వేల కోట్ల రూపాయలు వ్యయం కూడా చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెండిం గ్లో ఉన్న ప్రాజెక్టులను ఏడాది చివరి నాటికి పూర్తి చేసి 36.44 లక్షల ఎకరాలను కొత్తగా సాగులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులను పనులు వేగవంతం చేసేలా దిశా నిర్దేశం చేసింది. వీటితో పాటు గత ఏడాది కురిసిన భారీ వర్షాల వలన కృష్ణా , గోదావరి , పెన్నా , తదితర నదుల పరిధిలో పొర్లుకట్టలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద ప్రవాహం పొర్లుకట్టలను దాటి సమీప గ్రామాలను చుట్టుముట్టింది. దీంతో వరదల సమయంలో వందలాది గ్రామాలు రోజులు తరబడి వరదనీటిలోనే నీట మునిగాయి. రానున్న వరదలను దృష్టిలో ఉం చుకుని పై సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పొర్లుకట్టను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆయా నదుల పరిధిలో కాంక్రీట్ వాల్‌ను నిర్మించాలని నిర్ణయం తీసకుని ఆ పనుల కోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. ప్రాజెక్టులతో పాటు పొర్లుకట్టల పనులు కూడా ఏడాది చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
నవరత్నాల పరిధిలోకి పలు ప్రాజెక్టులు
రాష్ట్రంలో జలయజ్ఞం పథకం ద్వారా 54 ప్రాజెక్టులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు 14 ప్రాజెక్టులను పూర్తి చేసి ంది. మరో రెండు ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయి. మిగిలిన 38 ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యోచిస్తుంది. అందుకోసం జలయజ్ఞం పరిధిలోని ప్రాజెక్టులను నవరత్నాల పరిధిలోకి తీసుకొచ్చి మరింత వేగవంతంగా నిర్మాణ పనులను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించేందుకు జలయజ్ఞం పథకం ద్వారా భారీ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యంగా కరువుపీడిత ప్రాంతాలైన రాయలసీమ , ప్రకాశం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిధిలోని ప్రాజెక్టులను నవరత్నాల కిందకు తీసుకునివచ్చింది. ఆ దిశగా ఆయా ప్రాంతాలను ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతను కల్పించింది.
40 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుతో పాటు ఉత్తరాంధ్ర , రాయలసీమలోని మరికొన్ని ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అం దులో భాగంగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు , వంశధార ఫేస్ -2 , వంశధార , నాగావలి నదుల అనుసంధానం , తోటపల్లి బ్యారేజ్ , గజపతినగర్ బ్రాంచ్ కెనాల్ , తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టు , మహేంద్రతనయ నదిపై రిజర్వాయర్ నిర్మాణం పనులకు అత్యంత ప్రాధాన్యతను కల్పించింది. అలాగే ఉత్తరాంధ్ర పరిధిలోని సుజల స్రవంతి, వంశధార నదిపై నేరడి బ్యారేజ్ , రాయలసీమ ఎత్తిపోతల పథకం , గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్ – 2, హంద్రి – నీవా సుజల స్రవంతి ఫేజ్ – 2 కుప్పం వరకు పొడగింపు , అదే ప్రాంతంలో తాజాగా నిర్మిస్తున్న లిప్ట్n ఇరిగేషన్ పథకం , అలాగే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రభావిత ప్రాంతాలకు యర్రబల్లి లిప్ట్n ఇరిగేషన్ పథకం , కుందూ నదిపై రాజోలి రిజర్వాయర్ , రాజోలి బండ మళ్లింపు పథకం , మడకశిర బైపాస్ కెనాల్ , అలాగే కర్నూలు జిల్లాలోని పశ్చిమ మండలాలకు నీటిని సరఫరా చేసేందుకు డోన్‌లో 68 ట్యాంకుల నిర్మాణం,మంత్రాలయం వద్ద 5 ఎత్తిపోతల పథకాలు , ప్రకాశం బ్యారేజ్ దిగువన 67.10వ కిలోమీటర్ వద్ద బ్యారేజ్ కమ్ బ్రిడ్జి నిర్మాణం పనులను రెండో ప్రాధాన్యత కింద పూర్తి చేయబోతుంది.
శరవేగంగా వరద పొర్లుకట్టల నిర్మాణ పనులు
రాష్ట్రంలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు గోదావరి , కృష్ణ, పెన్నా ,వంశధార, మొదలైన నదుల పరివాహక ప్రాంతాల్లో వరద పొర్లుకట్టలు దెబ్బతిన్నా యి. ఫలితంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. దెబ్బతిన్న పొర్లుకట్టను శాశ్వతం గా ఆధునీకరించేందుకు జలవనరుల శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన ప్రతిపా దనలు రూపొందించారు. అందుకోసం 1813.58 కోట్ల రూపాయలను అవసరమని గుర్తించింది. ఆ దిశగా బడ్జెట్లో నిధులను కూడా కేటాయించింది. వీటితో పాటు వంశధార , నాగావలి , కుందు, హంద్రి, పెన్నా , కండేరు, కాళంగి, తదితర నదుల పరిధిలోని పొర్లుకట్టలను కూడా ఆధునీకరించి భవిష్యత్తులో వరదల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా పటిష్ట చర్యలను తీసుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి కొత్త ఆయకట్టును సాగులోకి తేవాలని జగన్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.