ఉమ్మడిపశ్చిమబ్యూరో ప్రభన్యూస్ : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఐఆర్ ప్రకటించాలని, అలాగే 12వ పిఆర్సి కమిషన్ ను తక్షణమే నియమించి ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకోవాలని, ఏపీ జెఎసి అమరివతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం ఏలూరులోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో 26 జిల్లాల చైర్మన్లు ప్రధాన కార్యదర్శులు పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమావేశపు తీర్మానాలను చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ పాలిసెట్టి దామోదర్ రావు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చైర్మన్ కే రమేష్ కుమార్ లు మీడియాకు వివరించారు.
ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం నియమించిన 12వ పిఆర్సి కమిషనర్ రాజీనామా చేసినందున వెంటనే పిఆర్సి కమిషన్ను నియమించి నిర్నీత కాలమరి పరిమితి లోపు 12వ పిఆర్సి అమలు చేసి గత 11వ పిఆర్సి సందర్భంగా నష్టపోయిన ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నందున గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని 12వ పిఆర్సి ద్వారా భర్తీ చేస్తుందని నమ్మకంతో రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆశాభావంతో ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అడక్కుండానే ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించి అనుకూల నిర్ణయాలు వెలువరించినందుకు 90 ఉద్యోగ సంఘాలతో కూడిన జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తుందని పేర్కొన్నారు.
సెక్రటేరియట్ ఉద్యోగులకు హెచ్వోడీలకు ఐదు రోజుల పని దినాలను నిర్ణయిస్తూ జీవో విడుదల చేయడం, తాసిల్దార్లు ఎన్నికల విధులు పూర్తయిన వెంటనే వారం రోజుల్లోనే వారి సొంత జిల్లాలకు పంపడం, అలాగే గత పదేళ్ళుగా ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు 122 మందిని తెలంగాణాకు తిరిగి పంపడం. పదవి విరమణ దగ్గరలో ఉన్న ఉద్యోగులను బదిలీల నుండి మినహాయించడం వంటి సానుకూల అంశాలు ఈ ప్రభుత్వం తీసుకోవడం పట్ల తమ సమావేశం హర్షం వెలిబుచ్చినట్లు చెప్పారు.
అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్షనర్లకు చెల్లిస్తున్న అడిషనల్ కౌంటర్ ఆఫ్ పెన్షన్ స్లాబ్ లను గత ప్రభుత్వం 11వ పిఆర్సి చర్చలు సందర్భంగా కొత్తగా పెన్షనర్లకిపెంచకపోగా అప్పటివరకు పొందుతున్న స్లాబ్ తగ్గించారని ఇంతటి దుర్మార్గ చర్య గతంలో ఎన్నడు జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వం పాతస్లాబుల ప్రకారం పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ చెల్లించాలని కోరారు.
అదేవిధంగా గత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులు అందరిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం ఆరోగ్య శాఖలో వారిని మాత్రమే క్రమబద్ధీకరణ చేశారని ,విద్యారంగంలోనూ ఇతర శాఖలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. అలాగే ఇప్పటివరకు పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు పదవీ విరమణ బెనిఫిట్స్ అందడం లేదని ప్రతి ఉద్యోగి రిటైర్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ తో తన కుటుంబ అవసరాలను తీర్చుకుంటారని, కానీ గత కొంతకాలంగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో రిటైర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదనవ్యక్తంచేశారు.
తక్షణం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని కోరారు. ఒక ఉద్యోగి ఒకే సంఘం లో సభ్యుడిగా ఉండాలి తప్ప బహుళ సభ్యత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తమ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్పారు. అలాగే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తొలగించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తించేలా చూడాలని కోరుతూ తీర్మానించారు.
ఈ సమావేశంలో ఏపీజేఏసీ అమరావతిలో కోశాధికారిగా పనిచేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు ఈనెల 31న పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఘనంగా సత్కరించారు. అలాగే ఏపీ జేఏసీ కమిటీలోకి కనపర్తి సంగీతరావు రాష్ట్ర కోశాధికారిగా ,జనుకుల శ్రీనివాసరావును రాష్ట్ర కోచేర్మన్ గా, డీజీ ప్రసాదరావును రాష్ట్ర వైస్ చైర్మన్ గా, కోన ఆంజనేయకుమార్నురాష్ట్ర కార్యదర్శిగా, నియమించారు.
కాగా ఈ సమావేశంలో అమరావతి అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణికర్ రాజు, కోశాధికారి వీవీ మురళీకృష్ణ నాయుడు, ప్రచార కార్యదర్శి బి కిషోర్ కుమార్, స్టేట్ ఉమెన్ కమిటీ చైర్పర్సన్ పారి లక్ష్మి ,సెక్రెటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, ఏపీజెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ సభ్యులు 26 జిల్లాల ఏపీ జెఎసి అమరావతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.