Friday, November 22, 2024

ఇంటర్మీడియెట్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. జూలై 12 వరకూ ఆన్‌లైన్‌లో స్వీకరణ

అమరావతి, ఆంధ్రప్రభ: సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)ల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియెట్‌ మొదటి ఏడాది ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. గత విద్యా సంవత్సరం వరకు రాష్ట్రంలోని 221 కేజీబీవీల్లో మాత్రమే ఇంటర్మీడియెట్‌ విద్య అందించగా, ఈ విద్యా సంవత్సరం నుంచి మిగిలిన 131 కేజీబీవీల్లో కూడా ఇంటర్మీడియెట్‌ విద్య అప్‌గ్రేడ్‌ చేశామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అనాథలు, పేద ఎస్‌.సి, ఎస్‌.టి, బిసి, మైనారిటీ, బి.పి.ఎల్‌ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే ప్రవేశాలకు పరిగణిస్తామని అన్నారు. ఆసక్తిగల బాలికలు ఈ నెల 27వ తేదీ(సోమవారం) నుంచి జూలై 12 వరకు ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు పొందగలరని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్‌ మెసేజ్‌ ద్వారా సమాచారం అందుతుందని తెలిపారు. దీంతోపాటు సంబంధిత కేజీబీవీల నోటీసు బోర్డులో నేరుగా చూడవచ్చని తెలిపారు. ఏవైనా సమస్యలు, సందేహాలకు 94943 83617, 94907 82111 నంబర్లను సంప్రదించాలని ఎస్పీడీ కె. వెట్రిసెల్వి సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement