Saturday, November 23, 2024

AP | సినిమా ఆపరేటర్ల పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం..

అమరావతి, ఆంధ్రప్రభ: సినిమా ఆపరేటర్స్‌ పరీక్ష – 2023 కోసం అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యుత్‌ భద్రతా సంచాలకులు, ప్రభుత్వ ప్రధాన విద్యుత్‌ తనిఖీల శాఖ పేర్కొంది. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన జారీచేసింది. జూలై 2023లో నిర్వహించే సినిమా ఆపరేటర్స్‌ పరీక్ష కొరకు అర్హతగల అభ్యర్థులు జూలై 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు అందజేయాలని తెలిపింది. సదరు దరఖాస్తు దారులు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి 2022 జూన్‌ నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైనా లైసెన్సుడ్‌ సినిమా ధియేటర్‌లో ఒక సంవత్సరం అప్రెంటెషిప్‌ టైనింగ్‌ పూర్తి చేసి ఉండాలని సూచించింది.

అలాగే గత ఏడాది జులై 1వ తేదీ నాటికీ 18 సంవత్సరాల వయస్సు పూర్తిఅయి ఉండాలని, షెడ్యూల్డ్‌ కులాలు మరియు షెడ్యూల్డ్‌ తెగల అభ్యర్థులకు 10వ తరగతి పరీక్షలో పాస్‌ అయినా, ఫెయిల్‌ అయినా సినిమా ఆపరేటర్స్‌ పరీక్ష వ్రాయడానికి అర్హులని పేర్కొంది. పరీక్షా కేంద్రం విజయవాడలో ఏర్పాటు- చేస్తామని, పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రూ. 600 రుసుమును చలానా రూపంలో జమ చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫారాలు కావలిసినవారు విద్యుత్‌ భద్రతా సంచాలకులు మరియు ప్రభుత్వ ప్రధాన విద్యుత్‌ తనిఖీ అధికారి వారి కార్యాలయం, బ్రాడీ పేట, గుంటూరు నుండి పొందవచ్చునని, దరఖాస్తు ఫారాల కొరకు జత చేయవలసిన డాక్యూమెంట్లు- ఇతర వివరాలకు విద్యుత్‌ భద్రతా సంచాలకులు మరియు ప్రభుత్వ ప్రధాన విద్యుత్‌ తనిఖీ అధికారి వారి నుండి వివరాలు పొందవచ్చునన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement