అమరావతి,ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్సు ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ సంచాలకులు డా.ఎం.ఆర్.ప్రసన్నకుమార్ తెలిపారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన పిఎన్.స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ విజయవాడ,రాయలసీమ ఇనిస్టిట్యూట్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్, గాంధీనగర్, కడప, వావిలాల సంస్థ లైబ్రరీ సైన్స్,అరండల్ పేట, గుంటూరుల్లోని సంస్థల్లో ఒక్కొక్క సంస్థలో 40 తెలుగు మీడియం, 40 ఆంగ్లమాద్యం సీట్లు ఉన్నాయి.
మొత్తం 120 తెలుగు మాద్యమం, 120 ఆంగ్ల మాద్యం సీట్లుఉన్నాయని ఆయన తెలిపారు. వచ్చే డిశంబరు 1వ తేదీ నుండి 2023 ఏప్రిల్ 30వ తేదీ వరకూ ఐదు నెలల కాలవ్యవధితో ఈ సర్టిఫికెట్ కోర్సును నిర్వహించనున్నారు. ఈశిక్షణా కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపే అభ్యర్ధులు విధిగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలని లేదా యుజిసి గుర్తింపు కలిగిన ఏదైనా విద్యాసంస్థలో తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలని స్పష్టం చేశారు.