Thursday, November 21, 2024

Invitation – రండి .. క‌లిసి ప‌నిచేద్దాం – యాపిల్ వైస్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేష్

యాపిల్ యూనిట్‌కు అనువైన ప్రాంతం
కోరుకున్న చోట భూములిస్తాం
యాపిల్ వైస్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేష్ భేటీ
స్నేహ‌పూర్వ‌క వ్యాపార విధానాలపై చ‌ర్చ‌
ఏపీని గ్లోబ‌ల్ టెక్నాల‌జీ, మ్యాన్యుఫ్యాక్చ‌రింగ్ హ‌బ్‌గా చేస్తున్నాం
పెట్టుబ‌డ‌ల‌కు అడ్డంకులేమీ లేవు
ఏపీ టెక్నాల‌జీ విధానాల‌ను వివ‌రించిన లోకేష్‌
సానుకూల‌త వ్య‌క్తం చేసిన ప్రియా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం

ఆంధ్రప్రభ స్మార్ట్, అమరావతి :

ప్రపంచంలోనే వాణిజ్య దిగ్గజం యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. యాపిల్ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. బలమైన మౌలిక సదుపాయాలు, స్నేహపూర్వక వ్యాపార విధానాలతో ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వం యాపిల్ విస్తరణకు అవసరమైన మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ఏపీలోని నాలుగు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో అనుకూల ప్రాంతాన్ని అన్వేషించండని, కోరుకున్నచోట తయారీ యూనిట్ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు. యాపిల్ సంస్థ నవీన ఆవిష్కరణలపై దృష్టి సారించేందుకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్ సంస్థ తమ కార్యకలాపాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, అధునాతన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ ప్రయోజనకరంగా ఉంటాయన్నారు.

పెట్టుబడులకు అడ్డు లేదు

ప్రధాన మార్కెట్లకు సులభతర యాక్సెస్ కలిగిన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు వ్యూహాత్మక ప్రదేశమన్నారు. తయారీ, పంపిణీలకు తమ వద్ద అనువైన ఎకోసిస్టమ్ ఉందన్నారు. లాజిస్టిక్స్, సప్లయ్ చైన్ నిర్వహణకు భరోసా నిస్తూ ఆధునిక నౌకాశ్రయాలు, రహదారి మార్గాలతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. తయారీ యూనిట్లకు అనుకూల విధానాలు, పన్ను ప్రోత్సాహకాలతో ఆంధ్రప్రదేశ్ ముందున్నట్టు తెలిపారు. విదేశీ పెట్టుబడులకు అవసర ఫ్రేమ్‌వర్క్‌ను ఏపీ అందిస్తోందని, యాపిల్ సంస్థ గ్లోబల్ ప్రొక్యూర్‌మెంట్ స్ట్రాటజీలో భాగస్వామ్యం వహించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేవలం ఆర్థిక వృద్ధిని సాధించడమేగాక సాంకేతిక పురోగతి, సమాజాభివృద్ధి లక్ష్యాల సాధనకు తమతో కలిసి దీర్ఘకాలిక భాగస్వామ్యం వహించాలని మంత్రి లోకేష్ కోరారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రియా సుబ్రహ్మణ్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement