Friday, October 25, 2024

Invitation – ఎపికి తరలిరండి – సినీ పరిశ్రమకు మంత్రి కందుల పిలుపు

*రాష్ట్ర పర్యాటక రంగానికి పునర్ వైభవం

* *కొత్త టూరిజం పాలసీ రూపొందిస్తున్నాం..

ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి రానున్న పర్యాటక హిత పాలసీ*

*పర్యాటకులను ఆకర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూపకల్పన*

*టెంపుల్, ఎకో, వెల్ నెస్ టూరిజంలతో పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట**

- Advertisement -

ఫిల్మ్ టూరిజం డెవలప్ మెంట్ కు ఏపీ అనుకూలం..

తెలుగు సినీ ఇండస్ట్రీతో చర్చించి ఏపీలో చలనచిత్ర అభివృద్ధికి చర్యలు..

ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందించేందుకు హామీ*

  • పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

విశాఖపట్నం: ఆంధ్ర ప్రభ బ్యూరో 2025-30 కి సంబంధించి 5 ఏళ్లకు కొత్త టూరిజం పాలసీని రూపొందిస్తున్నామని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి పునర్ వైభవం వస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.శుక్రవారం విశాఖపట్నం లో జరిగిన సీఐఐ టూరిజం అండ్ ట్రావెల్ సమ్మిట్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం శుభపరిణామని, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సదస్సులో వివరించారు. ఏప్రిల్ 2025 నుండి కొత్త పర్యాటక హిత పాలసీ అమల్లోకి రానుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూపకల్పన చేస్తున్నామన్నారు.

సెప్టెంబర్ 27వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ పర్యాటక దినోత్సవంలో రాష్ట్ర పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు. ఇండస్ట్రీలకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ టూరిజానికి కూడా కల్పిస్తామన్నారు.

పర్యాటక అభివృద్ధి కోసం ప్రాజెక్ట్ లతో ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా రాయితీలు కల్పిస్తామన్నారు. మొత్తం ఉపాధి కల్పనలో టూరిజం ద్వారా కనీసం 20 శాతం ఉద్యోగాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారని మంత్రి వివరించారు.

రాష్ట్ర పర్యాటకానికి సీఎం ఎంతో ఊరట ఇచ్చే మాట చెప్పారని మంత్రి పేర్కొన్నారు. వివిధ వర్గాల నుంచి తీసుకున్న సమాచారంతో కార్యాచరణ ప్రారంభించామన్నారు. కేరళ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని వనరులున్నాయని అందులో భాగంగా 974 కి.మీల సుదీర్ఘ తీర ప్రాంతం, పదుల సంఖ్యలో బీచ్ లు, అపార సహజ వనరులు, నదులు, చరిత్ర, సంస్కృతి, ప్రాచీన ఆలయాలు, బౌద్ధారామాలు, వన్య ప్రాణి అభయారణ్యాలు, జాతీయ పార్క్ లు ఇలా ఎన్నో విధాలుగా పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు ఉన్నాయని దుర్గేష్ తెలిపారు.

పర్యాటకులను ఆకర్షించేలా టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్ నెస్, అగ్రి టూరిజంలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తున్నామని తద్వారా సత్ఫలితాలు సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల కృషితో కేంద్ర ప్రభుత్వం సై తం స్వదేశీ దర్శన్, ప్రసాద్ తదితర పథకాలతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు.

వందల కోట్ల కేంద్ర ప్రభుత్వ పర్యాటక పథకాల నిధులతో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహకారం ఉంటుందని దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

రాష్ట్ర పర్యాటక ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశామని త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. రాష్ట్రంలో బీచ్ టూరిజం అభివృద్ధి చేసి జనవరిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.

సినిమాలు, లఘు చిత్రాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. దేశంలో 3వ అతిపెద్ద సముద్రతీరం ఏపీలో ఉన్నప్పటికీ కేవలం రుషికొండ మాత్రమే బ్లూఫాగ్ బీచ్ గా ఎంపికైందని దానితో పాటు అందమైన కాకినాడ, సూర్యలంక, మైపాడు, రామాపురం బీచ్ లున్నాయని గుర్తుచేశారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అక్రమాల వల్ల పర్యాటక రంగం కుంటుపడిందని తద్వారా పర్యాటకంగా రాష్ట్రం చాలా నష్టపోయిందని మంత్రి విమర్శించారు.

ఎండో మెంట్, ఫారెస్ట్, టూరిజం మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని మంత్రి గుర్తుచేశారు. టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి అవసరమైన సలహాలు తీసుకొని ముందుకెళ్తామన్నారు. రాష్ట్రంలో అధ్యాత్మిక ప్రాంతాలుగా తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం తదితర ప్రాంతాలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మంది అధ్యాత్మిక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులేనని ఈ క్రమంలో ఉదాహరణకు సింహాచలం లాంటి ప్రాంతానికి పర్యాటకుడు వస్తే సమీపంలోని లంబసింగి, అరకులోయ, మారేడుమిల్లి తదితర ప్రాంతాలను సందర్శించేలా సర్య్కూట్ లు అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని తద్వారా ఆయా ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు మూడు, నాలుగు రోజుల పాటు ఉండే విధంగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

రిసార్ట్ లు, జంగిల్ సఫారీలు, రోప్ వేలు, ఐకానిక్ బ్రిడ్జిలు, అడ్వెంచరస్ యాక్టివిటీస్, వాటర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ద్వారా టెంపుల్ టూరిజంతో పాటు ఎకో టూరిజం డెవలప్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అదే విధంగా తొట్లకొండ, శాలిహుండం తదితర ప్రాంతాల్లో బౌద్దారామాలు అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భాగంగా నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ నగరంగా దక్షిణ భారత దేశంలో విశాఖకు చోటు కల్పించడం గర్వించదగ్గ అంశమన్నారు.

విశాఖపట్నంను క్రూయిజ్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖపట్నం నుండి చెన్నై, పుదచ్చేరి ప్రాంతాలకు వెళ్లేలా లగ్జరీ క్రూయిజ్ లు ఏర్పాటు చేసి క్రూయిజ్ టూరిజం డెవలప్ చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్, తాజ్ లాంటి ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయని, పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు పెడతామని చెప్పడం సంతోషకరమన్నారు.

ఏపీలో సినీరంగం అభివృద్ధి చెందాలని మంత్రి కందుల దుర్గేష్ కాంక్షించారు. రాష్ట్రంలో ఫిల్మ్ టూరిజం అభివృద్ధి చెందేందుకు మంచి అవకాశాలున్నాయని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందని తెలిపారు. విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టం తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో ఫిల్మ్ టూరిజం డెవలప్ మెంట్ కు సంబంధించి ఏ పాలసీలు అమలు చేస్తే బాగుంటుందో సూచించాలని సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ ను కోరారు. పీపీపీ విధానంలో ముందుకెళ్లి అభివృద్ధి చేసుకుందామని సూచించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సినిమా షూటింగ్ జరుగుతున్నాయని, ఇదే క్రమంలో చిత్ర పరిశ్రమను వృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని మంత్రి అభిప్రాయపడ్డారు. తద్వారా పలువురికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

ఈ విషయంపై సినీ ఇండస్ట్రీ పెద్దలతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చిద్దామన్నారు. సినిమా ఇండస్ట్రీ కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఇప్పటికే టికెట్ల రేట్ల విషయంలో తాము చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే షూటింగ్ లకు సంబంధిత ప్రాంతాల పేర్లను ప్రదర్శించాలని కోరారు. తద్వారా ఏపీ టూరిజం మరింత వృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రుషికొండ భవనాలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై నెలరోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.

మాకు రెండు రాష్ట్రాలు ముఖ్యం: నిర్మాత సురేష్

సిని పరిశ్రమ విశాఖకు రావడం కంటే ఇక్కడ లోకల్ టాలెంట్‌ను పోత్సాహించడం అవసరమని సినీ నిర్మాత‌ దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. సినిమా తీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయిందన్నారు. ఎక్కడ నుంచైనా సినిమా తీయవచ్చని తెలిపారు. సోషల్ మీడియా ప్రభావం సినిమా మీద విపరితంగా ఉందన్నారు. చైన్నై నుంచి హైదరాబాద్‌కు అతికష్టం మీద తరలివచ్చామని చెప్పారు. ఇప్పుడు తమకు రెండు రాష్ట్రాలు ముఖ్యమని స్పష్టం చేశారు.మనం తీసేది తెలుగు సినిమా కాబట్టి ఎక్కడ తీసిన ఒక్కటే అని .. అక్కడ ఇక్కడ ఉన్నది తెలుగు వాళ్లే అని అన్నారు. సిని టూరిజాన్ని అభివృద్ది చేయాలన్నారు. మనకు చాల వనరులు ఉన్నప్పటికీ వచ్చే టూరిస్టులు మాత్రం తక్కువన్నారు. ఫ్రెండ్లీ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. కట్టడి లేకుండా టూరిస్టులుకు స్వేచ్ఛ ఇవ్వాలని.. అప్పుడే టూరిజం అభివృద్ధి చెందుతుందని నిర్మాత సురేష్ బాబు అభిప్రాయపడ్డారు

ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్, సురేష్ ప్రొడక్షన్స్ సీఈవో, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, సీఐఐ విశాఖపట్నం ఛైర్మన్ రాజేష్ గ్రంధి, సీఐఐ విశాఖపట్నం వైస్ ఛైర్మన్ వి.అజయ్ కుమార్, సీఐఐ టూరిజం ప్యానెల్ కన్వీనర్ రాజీ ఇందుకూరి, జేఎల్ఎల్ ప్రతినిధి జెర్రి కింగ్స్లే, సీనియర్ డైరెక్టర్ ఎస్. రాబిన్, సీఐఐ ప్రతినిధులు వి. మురళీకృష్ణ, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్. రాజారెడ్డి, ఇమాజికా వరల్డ్ ఎంటర్టైన్ మెంట్ లిమిటెడ్ సీఈవో ధీమంత్ బక్షి, హాలిడుస్ బిజినెస్, యాత్రా ఆన్ లైన్ లిమిటెడ్ సీఓఓ క్రిషన్ సింగ్, హాలిడే వరల్డ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ మోహన్, బుక్ మై షో వర్దన్ సిగటాపు, నీతి ఆయోగ్ కన్సల్టెంట్ మన్వేంద్ర జైన్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement