Friday, November 22, 2024

Visakhapatnam : షేర్ మార్కెట్లో పెట్టుబడులు పేరిట రూ.4 కోట్లకు కుచ్చుటోపి

మహా విశాఖ నగరంలో నేరాలు రోజుకో రీతిన వెలుగుచూస్తున్నాయి. వైట్ కాలర్ నేరగాళ్లు ఎవరు ఊహించని విధంగా విభిన్న రీతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, చిట్ ఫండ్స్ పేరుతో చీటింగ్ లు ఇలా పలు రకాల నేరాలను చూసాం. కాగా తాజాగా నగరంలో జరిగిన ఓ మోసపూరిత సంఘటనలో 19మంది ఓ ప్రబుద్ధుడు చేతిలో దారుణంగా మోసపోయారు. వివరాల్లోకి వెళితే….. నగరంలోని సత్యం జంక్షన్ లో ఈక్విటీ నాక్స్ అనే పేరుతో జార్ఖండ్ కి చెందిన రాహుల్ సింగ్ అనే వ్యక్తి స్టాక్ మార్కెట్ కార్యాలయాన్ని తెరిచాడు. తాను షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అత్యధిక లాభాలు సంపాదిస్తున్నానని అందర్నీ నమ్మించాడు. విశాఖలో ఉన్న బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్( బి ఎన్ ఐ) లో చేరి వేరువేరు వ్యాపార రంగాల్లో ఉన్న పలువుkrతో మంచి పరిచయాలు ఏర్పరచుకున్నాడు.

తన కార్యాలయానికి అందర్నీ ఆహ్వానించి , షేర్ మార్కెట్లో తాను సంపాదిస్తున్న లాభాలు గురించి నమ్మబలికాడు. మీరు కూడా మీ సేవింగ్స్ సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టుబడులుగా పెడితే మంచి లాభాలు వస్తాయని వారందరినీ నమ్మించి లక్షల్లో పెట్టుబడులు పెట్టించాడు. తొలుతగా నూటికి మూడు రూపాయలు వడ్డీ చొప్పున రిటర్న్స్ ఇచ్చి వారిలో రెట్టింపు నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. దీంతో సుమారు 19మంది రాహుల్ సింగ్ కు మూడు నుంచి నాలుగు కోట్లు పెట్టుబడులుగా ఇవ్వడం జరిగింది. ఇదంతా జరిగి మూడు నెలల వ్యవధి అయ్యింది. ఈ మధ్యకాలంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి నెల నెలా ఇవ్వాల్సిన లాభాలు ఇవ్వడంలో జాప్యం చేస్తూ వచ్చాడు. ఎందుకు ఇలా జరుగుతుందని వారు ప్రశ్నించగా తాను ముంబైలో ఉన్న ఛాయిస్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నానని, ఈ పెట్టుబడులన్నీ వారికి ఇవ్వడం జరిగిందని చెబుతూ తాత్సారం చేశాడు.

ఇదిలా ఉండగా గత నెల 16వ తేదీన షేర్ మార్కెట్ పని మీద కలకత్తా వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన రాహుల్ సింగ్ ఇప్పటివరకు తిరిగి విశాఖ నగరానికి రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నగరంలోని పంజాబ్ హోటల్ జంక్షన్ దారి జ్యోతి నగర్ ప్రాంతంలో నివాసముంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ కు తాళాలు వేసి అతడి భార్య జార్ఖండ్ వెళ్లిపోవడం జరిగింది. ఆఫీసుకు కూడా తాళాలు వేసి ఉండడంతో చేసేదేమీ లేక బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. సోమవారం ఉదయం పోలీసు సమావేశం మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో డిసిపి క్రైమ్ జి నాగన్న కలిసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఎంవిపి పోలీస్ స్టేషన్ సిఐ మల్లీశ్వరరావును కలిసి బాధితులంతా తమ గోడును విలపించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement