నెల్లూరు , ప్రభన్యూస్ : పెరిగిన మద్యం ధరలను బట్టి వేల రూపాయల ఖర్చు అవసరం లేదు. ముందస్తుగానే ఏర్పాట్లు చేసిపెట్టాల్సిన గత్యంతరమూ లేదు. కావాల్సిందల్లా రెండు బీడీ ముక్కులు .. లేదా సిగరెట్ .. కొంత గంజాయి ఆకు. అతి తక్కువ ఖర్చుతో మనస్సును ఊహల లోకాల్లోకి విహరింపజేసే గంజాయి వ్యసనం చాప కిందనీరులా పాకిపోతోంది. గతంలో రిక్షా కార్మికులు, స్లమ్ ఏరియాల్లో నివాసం ఉండే వారు, కాలం కలిసిరాక యాచకత్వం చేసుకుంటూ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లలో నిద్రపోయే కొద్ది మందికే పరిమితమైన ఈ వ్యసనం ప్రస్తుతం జోరందుకుంది. అల్పాదాయ వర్గాల అలవాటుగా ఉన్న గంజాయి సేవనం ప్రస్తుతం మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాలను కూడా కమ్ముకుంటోంది. తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో స్వర్గ లోకాన్ని మరిపింపజేసే గమ్మత్తు కారణంగా ముఖ్యంగా యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూ గంజాయి వ్యసనానికి లోనవుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి.. వారి నుంచి ఇంకొకరికి ఇలా ఈ వ్యసనం యువతలో పాకిపోతుండడంతో వారు చదువుపై కూడా శ్రద్ధ చూపకుండా బలాదూరుగా తయారవుతున్నారు. ముఖ్యంగా పసి వయస్సులోనే జీవచ్చవంలా తయారవుతూ తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు.
ఎస్‌ఈబీ దాడులు చేస్తున్నప్పటికీ .. ఉనికి చాటుకుంటూనే ఉన్న గంజాయి
జిల్లాలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అటు అక్రమ మద్యం నిల్వలు, ఇటు గంజాయి నిల్వలపై దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ దాడుల్లో కేజీల కొద్ది పట్టుబడుతున్నప్పటికీ జిల్లాకు రకరకాల మార్గాల ద్వారా గంజాయి చేరుకుంటూనే ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగినప్పటి నుంచి గంజాయి వాడకం పెరిగినట్లే కనబడుతోంది. ఎస్‌ఈబీ ఏర్పడిన తరువాత అక్రమ మద్యంపై దాడులు పెరగడం, వ్యాపాీరం లాభసాటిగా ఉండకపోతుండడంతో గతంలో అక్రమ మద్యం వ్యాపారం చేసిన పలువురు ప్రస్తుతం గంజాయి వ్యాపారాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. పెద్దగా రిస్కు లేకుండానే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో గంజాయి రవాణాకు విశాఖ ఒరిస్సా బార్డర్ కీలకంగా ఉంది.
ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో ఓ పద్ధతి ప్రకారం దాడులు, ఇతర శాఖల ఆధ్వర్యంలో గంజాయి సాగు వైపు రైతులు మొగ్గు చూపకుండా ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఏదో ఒక రవాణా వాహనం ద్వారా గంజాయి జిల్లాకు చేరుతూనే ఉన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా చెన్నైకు రవాణా అయ్యే గంజాయి నెల్లూరు గుండానే ప్రధానంగా ఆర్టీసీ బస్సుల ద్వారా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో ఇటీవల భారీ మొత్తంలో గంజాయి పట్టుబడుతున్నప్పటికీ సమాచారం లభ్యం కాక దాడులు తప్పించుకుని ఇక ఎంత గంజాయి రవాణా అవుతుందో ఊహించుకుంటే జరిగే అనర్ధం చెప్పలనవి కాకుండా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..