Tuesday, November 26, 2024

రియల్ వ్యాపారులకు ఊరట… కోర్టు ఉత్తర్వులతో తొలగిన ఆటంకం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగున్నర నెలలుగా రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకొనుంది. భూములు, స్థలాలు, ప్లాట్లు, ఫ్లాట్ల క్రయ, విక్రయాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. . దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పూర్వవైభవం రానుంది. అనుమతుల్లేని లేఔట్లలో వేసిన ప్లాట్లు రిజిస్ట్రేష్రన్‌ చేయొద్దని చెప్పే అధికారం టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టరు (డీటీసీపీ)కు లేదని ఇటీవల ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ అనధికార లేఔట్లలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేష్రన్లకు చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేష్రన్‌ శాఖ ఐజీ రామకృష్ణ, డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్ల్రను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే జిల్లాల్లోని డీఐజీలు, డీఆర్‌లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అనుమతుల్లేని స్థలాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై ఈ ఏడాది ఫిబ్రవరిలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూముల క్రయ, విక్రయాలు స్తంభించిపోయాయి. చలానా రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా భారీగా గండిపడింది. కోట్లలో వ్యాపార లావాదేవీలు ఆగిపోయాయు. మరోవైపు రియల్‌ వ్యాపారులు, ప్లాట్లు కొనగోలు చేసినవారు, చిన్నా, చితక వ్యాపారులతో పాటు మధ్యవర్తులు ఆర్థికంగా చితికిపోయారు. తాము పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ కొందరు రియల్‌ వ్యాపారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో చివరకు ప్రభుత్వం దిగి వచ్చింది. రిజిస్ట్రేషన్లలో పూర్వ పద్ధతినే అమలు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గతంలో నిలిపివేసిన రిజిస్ట్రేషన్లు యథావిధిగా మొదలయ్యాయి. ఈ సడలింపులతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో

రిజిస్ట్రేషన్లు ఊపందుకోనున్నాయి..

రాష్ట్ర వ్యాప్తంగా 280 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రోజువారీ రిజిస్ట్రేషన్ల సంఖ్యలోనూ, ఆదాయంలోనూ విశాఖ,గుంటూరు, కృష్ణా వుమ్మడి జిల్లాలు ముందంజలో ఉండేది. గతేడాది దాదాపు 8వేలకోట్ల రూపాయల ఆదాయం రిజిస్ట్రేష్ల్రన్ల ద్వారా ప్రభుత్వానికి చేకూరింది. అంటే నెలకు సగటున లక్ష చొప్పున ఏడాదికి 12 లక్షల రిజిస్ట్రేషన్ల వరకు జరుగుతున్నాయి. వీటి ద్వారా రూ.8వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నట్లు అధికారుల అంచనా. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అనధికార లేఅవుట్లపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ రిజిస్ట్రేషన్లు నిలిపేసింది. దీంతో రోజువారీ రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా చలానా రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. మరోవైపు రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ నిత్యం రద్దీగా ఉండే ఇక్కడి కార్యాలయాలు..క్రయ, విక్రయదారులు లేక వెలవెలబోయాయు. ఆంక్షల సడలింపుల విషయం తెలుసుకున్న రియల్‌ వ్యాపారులు, క్రయ, విక్రయదారులు బుధవారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి క్యూకట్టారు.

ఇదిలావుండగా భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అధికారికంగా ఆంక్షలు విధించినా.. అనధికారికంగా ఏడాది నుంచి అమలులో ఉంది. 2020 జనవరి 7వ తేదీకిపైన వ్యవసాయ భూమిగా ఉండి, గజాల ప్రకారం ఇంటిస్థలం కింద రిజిస్ట్రేషన్‌ అయి వుంటే, అలాంటి వాటిని నిషేధిత జాబితాలో చేర్చారు. అదే భూమి, అదే డాక్యుమెంటు 2020 జనవరి 6వ తేదీకి ముందు రిస్ట్రేషన్‌ అయివుంటే, ఆంక్షలు లేకుండా యధావిధిగా రిజిస్ట్రేషన్‌కు అనుమతించారు. అనధికార, అక్రమ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ ఆయా ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా అటు జిల్లా రిజిస్ట్రార్‌, ఇటు స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు లేఖలు పంపారు. కొన్నిచోట్లు, మరికొన్ని ఏరియాలలో వీటిని అమలు చేయకపోవడంతో చివరకు కలెక్టర్‌ లేఖ ద్వారా జిల్లా రిజిస్ట్రార్‌ జోక్యంతో రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌ పడింది. ఆయా సర్వే నెంబర్లు బ్లాక్‌ చేయడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. తర్వాత ప్రభుత్వం కూడా ఇదే విధానం అమలు చేయడంతో రియల్‌ వ్యాపారం కుప్పకూలిపోయింది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న బడా, చిన్నపాటి రియల్‌ వ్యాపారులు సైతం బెంగళూరుకు మకాం మార్చారు. అక్కడే ఉంటూ స్థలాలు, ప్లాట్ల క్రయ, విక్రయాలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారంతా తిరిగి వచ్చే అవకాశముంది. ఇదిలా వుండగా కొందరు వ్యాపారులు, మధ్యవర్తులు కొనగోలు చేసిన ప్లాట్లు, స్థలాలు అమ్ముకోలేక, అగ్రిమెంట్లకు గడువు ముగిసిపోవడం, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక.. అనధికార స్థలాన్ని సక్రమంగా చేసుకునే క్రమంలో అటు ప్రభుత్వానికి, ఇటు పంచాయతీకి భూమి మార్కెట్‌ విలువలో 14 శాతం చలానా చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఇంకొందరు లేఅవుట్‌లో పదిశాతం స్థలాన్ని పంచాయతీలకు రాయించి, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. మొత్తమ్మీద తీసుకుంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తిరిగి పూర్వవైభవం రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement