Tuesday, November 26, 2024

ఇంటర్‌నెట్‌ ఇక్కట్లు.. కోనసీమలో ఆన్‌లైన్‌ అవస్థలు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిన చందాన.. కోనసీమ జిల్లాలో ఇంటర్‌నెట్‌ వినియోగదారుల పరిస్ధితి ఉంది. గత నాలుగురోజులుగా జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ పని చేయకపోవడంతో దాని ఆధారంగా కార్యకలాపాలు సాగించేవారు, ముఖ్యంగా ఇంటర్‌నెట్‌ సాయంతో పని చేసే ఉద్యోగులు, విద్యార్ధులు అష్టకష్టాల పడుతున్నారు. జిల్లాకు అంబేద్కర్‌ నామకరణం చేయాలని ఓ వైపు.. కోనసీమగానే కొనసాగించాలంటూ మరోవైపు ఇలా రెండు వర్గాల పోరాటంలో అమలాపురం అతలాకుతలమై అగ్గిరాజుకున్న నేపధ్యంలో పోలీసు ఆంక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా ఇంటర్‌నెట్‌ బంద్‌పై పోలీసుశాఖ కఠిననిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పైగా అమలాపురంలో అల్లర్లకు పాల్పడిన వారంతా వాట్సాప్‌ వినియోగం ద్వారా తమ ప్రణాళికను షురూ చేశారన్న ప్రధాన అంశాన్ని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. అమలాపురంలో మంత్రి ఇల్లు, ఎమ్మెల్యే నివాసంతోపాటు పోలీసు వాహనాలు, ఆర్టీసి, స్కూలు బస్సులను దగ్ధం చేయడంతోపాటు విధ్వంసానికి పాల్పడిన ఘటనపై ప్రాధమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు 46 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. వీరిలో నిందితులు ప్రధానంగా ఇంటర్‌నెట్‌ వినియోగం ద్వారా ఆన్‌లైన్‌ మేసేజ్‌లు, వాట్సాప్‌ ఛాటింగ్‌ల ద్వారానే తమ కార్యకలాపాలను పక్కా ప్రణాళికతో నిర్వహించినట్లు పోలీసు ఉన్నతాధికారులే స్పష్టం చేస్తున్నారు.

అయితే అల్లర్లు కట్టడి చేసి పరిస్ధితి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటికీ జిల్లాలో పకడ్భందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అసాంఘిక శక్తులు చలరేగకుండా అదనపు బలగాలు మోహరించి కవాతు చేస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటూనే మరోవైపు అల్లర్లకు పాల్పడిన నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో నిందితులు తప్పించుకోకుండా వారి మధ్య కమ్యూనికేషన్‌ లేకుండా ఉండేందుకు ఇంటర్‌నెట్‌కు పోలీసులు బ్రేక్‌ వేశారు.

అరెస్టులన్నీ పూర్తయ్యాకే నెట్‌ పునరుద్ధరణ..

అమలాపురం అల్లర్లతో ప్రమేయం ఉన్న వారందరినీ గుర్తించి అరెస్టులు పూర్తి చేసిన తర్వాతే జిల్లాలో ఇంటర్‌నెట్‌ సేవలు పునరుద్ధరించనున్నట్లు డీఐజీ జి పాలరాజు స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా ప్రజల జీవనానికి విఘాతం లేకుండా సామరస్యమైన వాతావరణం నెలకొల్పినా నెట్‌ సేవలు లేకపోడవంతో కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి వర్తక, వాణిజ్య కార్యకలాపాలకు ముడి పడి ఉన్న ఆన్‌లైన్‌ చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో డిజిటల్‌ కరెన్సీ మారకానికి ఇబ్బంది ఎర్పడటంతో ప్రజలకు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు రీఛార్జ్‌లు, బ్యాంకు సేవలు, ఆన్‌లైన్‌ సేవలు వంటి కార్యకలాపాలకు ప్రస్తుతం భంగం వాటిల్లిన నేపధ్యంలో నెట్‌ సేవలు పునరుద్ధరణకు జిల్లాలో పూర్తి స్ధాయి ప్రశాంతత నెలకొనాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు జిల్లాకు అంబేద్కర్‌ పేరు కొనసాగించే విషయంలో అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతున్నందున మరో రెండు, మూడు రోజుల వరకు నెట్‌ సేవలు ఉండకపోవచ్చనే అభిప్రాయం నెలకొంది. జిల్లా పేరు మార్పు విషయంలో ప్రజలు తమ అభిప్రాయాలను నెట్‌ద్వారా పంచుకునే విషయంలో అనుకోని సమస్యలు ఏర్పడితే మళ్లీ సమస్య పునరావృతం కారాదనే ఉధ్ధేశ్యంతో పోలీసుశాఖ ఉంది. అదేవిధంగా నిందితులను పూర్తిగా గుర్తించి అరెస్టు చేసేందుకే ఇలా చేశారని స్పష్టమవుతోంది. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారుల సెల్‌ఫోన్లు మాత్రమే పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement