ఈ ఏడాది జరగబోయే వార్షిక పరీక్షలకు ముందు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. కొవిడ్-19 కారణంగా 2020-21 విద్యా సంవత్సరంలో ప్రత్యక్ష బోధనా తరగతులు సరిగా జరగకపోవడంతో అప్పుడు పరీక్షలు నిర్వహించకుండానే ఫుల్ మార్కులు వేశామని బోర్డు అధికారులు తెలిపారు. కానీ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ క్లాసులు గతేడాది జూన్ నుంచి, ప్రత్యక్ష తరగతులు సెప్టెంబర్ 1 నుంచి జరిగాయని గుర్తుచేశారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా 2022 జనవరిలో కేవలం 14 రోజులు మాత్రమే విద్యార్థులకు సెలవులిచ్చామని తెలిపారు. క్లాసులు యధావిధిగా కొనసాగడంతో ఈ ఏడాది నార్మల్ ఇయర్‌గానే పరిగణిస్తూ ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించామని వెల్లడించారు.
ప్రతి ఏడాది నిర్వహించిన మాదిరిగానే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సారి కూడా ప్రాక్టికల్స్, థియరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు జరుగుతాయో లేదో అనే విషయంలో విద్యార్థులు అపోహలు పెట్టుకోవద్దని శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..