అమరావతి, ఆంధ్రప్రభ: గీతకార్మికుల సంక్షేమం కోసం సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వృత్తి రీత్యా పనులు చేస్తున్న క్రమంలో గీత కార్మికులు ప్రమాదానికి గురైతే ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ గీత కార్మిక భరోసా పేరుతో పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల బీమా భరోసా కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద గీత కార్మికులు కల్లు తీస్తూ ప్రమాదానికి గుర్తైతే బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవనుంది. మొత్తం రూ.10 లక్షల పరిహారంలో రూ.5 కార్మిక శాఖ ద్వారా, మరో రూ.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా కింద చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన విధానాలతో కూడిన ‘వైయస్‌ఆర్ గీత కార్మిక భరోసా’ పథకానికి సీఎం జగన్ శుక్రవారం నాడు ఆమోదం తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించే కార్మికులతో పాటు చెట్టుపై నుంచి పడి శాశ్వత అంగవైకల్యానికి గురయ్యే కార్మికులకు కూడా పరిహారం అందజేయాలని ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ అంగవైకల్యం బారిన పడే కార్మికులకు ఎక్సైజ్ శాఖ వైకల్యం సర్టిఫికెట్‌ను జారీచేయనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ గురువారం నాడే ఉత్తర్వులు జారీచేసింది.
95,245 కల్లు గీత కుటుంబాలకు భరోసా..
‘వైయస్‌ఆర్ గీత కార్మిక భరోసా’ పథకం కింద రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మిక కుటుంబాలకు ఆర్థికక భరోసా లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రతి ఏటా 1,200 మంది గీత కార్మికులు కల్లు తీస్తూ ప్రమాదానికి గురవుతున్నారు. వీరిలో దాదాపు 40 శాతం మంది కార్మికులు మరణిండం లేదా శాశ్వతంగా వైకల్యం బారినపడుతున్నారు. ఈ కుంటుంబాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ మార్పులతో కూడిన పథకానికి ఆమోదం తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రమాదవశాత్తూ మరణించిన గీత కార్మిక కుటు-ంబాలకు పరిహారంగా రూ. 2 లక్షలు మాత్రమే అందించేవారు. దీంతో పాటు ఎక్సైజ్ శాఖ నిబంధనల పేరుతో కార్మిక కుటుంబాలకు పరిహారం పూర్తిగా అందేది కాదు. ప్రమాదవ శాత్తు గీత కార్మికులు మరణిస్తే ఆయా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఎంత మాత్రం ఉండరాదన్నదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉద్దేశ్యమని సీఎం జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కల్లు గీత కార్మికులు గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, యాత, ఈడిగ ఉపకులాలతో పాటు- షెడ్యూల్ కులాలు, తెగలవాళ్లు కూడా ఈ వృత్తిమీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీళ్ల జీవన విధానం మెరుగుపడేలా, వారి జీవన భద్రతకు భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు నూతన కల్లు గీత విధానం తెస్తూ, 5.11.2022 న జీవో 693 ద్వారా కీలక నిర్ణయం తీసుకున్నారు. గీత కార్మికులకు ఏదైనా ప్రమాదం సంభవించి, ప్రాణాలు కోల్పోయినప్పుడు, ఆ కుటుంబాలు రోడ్డునపడకుండా, వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఎక్స్ గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంపై రాష్ట్రంలోని గీత, గీత ఉప కులాలన్నీ ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఎక్కడా లేని విధంగా..
గీత కార్మికుల కష్టాలు గుర్తించిన సీఎం జగన్ గీత వృత్తిదారుడు ప్రమాదానికి గురైతే.. రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా అందే విధంగా, అంటే వైఎస్‌ఆర్ బీమా నుంచి రూ.5 లక్షలు, ప్రభుత్వం నుంచి మరో రూ.5 లక్షలు ఇవ్వాలని నూతన పాలసీలో ప్రకటించారు. ఇటువంటి పరిహారం దేశంలో మరెక్కడా లేదు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో అత్యధికంగా గీత కార్మికులు ఉంటారు. దేశం మొత్తం మీద 8.51 కోట్ల తాటిచెట్లు ఉంటే.. ఒక్క తమిళనాడులోనే 5.31 కోట్ల చెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ రాష్ట్ర వృక్షం తాటిచెట్టే. అయినా, ఆ రాష్ట్రంలో ఎక్స్ గ్రేషియా చాలా తక్కువ. అసంఘటిత కార్మికులు మరణించిన సందర్భాల్లో ఇస్తున్నట్టు మాత్రమే పరిహారం ఇస్తున్నారు. దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ప్రమాద బీమా, ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలు ఇస్తున్నది మనమే. పక్క రాష్ట్రం తెలంగాణలో చూసినా, కేవలం రూ.5 లక్షలు మాత్రమే బీమా కల్పిస్తున్నారు.