ఇన్స్యూరెన్స్ కంపెనీలతో ఒప్పందం
ఓఎంయుపై సంతకం చేసిన నారా లోకేష్
ప్రీమియం కింద రూ.42 కోట్లు చెల్లింపు
వెలగపూడి – కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈమేరకు మంత్రి లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025వరకు కోటిమంది కార్యకర్తల భీమా కోసం తొలివిడతలో రూ.42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద భీమా లభిస్తుంది.
ఈ సందర్బంగా నారా లోకేష్ మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమనిధి సారధిగా తాను బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు.. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకూ రూ.138కోట్లు ఖర్చు చేసామన్నారు. గత అరాచక ప్రభుత్వంలో కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయవిభాగాన్ని ఏర్పాటు చేసామని వెల్లడించారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.. మృతిచెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తోపాటు కృష్ణాజిల్లా చల్లిపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేసి ఉచితంగా విద్యనందిస్తున్నామని చెప్పారు.. టిడిపిలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు పార్టీపరంగా అన్నివిధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు లోకేష్ ..