అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో ఇక మూడో నేత్రం పర్యవేక్షణ షురూ కానుంది. దేశంలోని ప్రతి పోలీసు స్టేషన్‌లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలన్న అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం ఆదేశాలకు ఎట్టకేలకు రాష్ట్రంలో పూర్తి స్ధాయిలో అమలు కానున్నాయి. ఇందుకు సంబంధించి హోంశాఖ 26కోెట్లకు పైగా బడ్జెట్ కేటాయించినా అమలుకు నోచుకోలేదు. ఇటీవల రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో కొందరు పోలీసు అధికారుల తీరు నానాటికీ వివాదాస్పదమవుతూ వస్తోంది. పలుచోట్ల స్టేషన్లలోనే నిందితులు వేధింపులకు గురి కావడం, ఆపై వారి మరణాలకు దారి తీయడం, అదేవిధంగా స్టేషన్లపై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తల దాడులు, ఇతర అంశాలు వంటివి రానురాను ఆందోళన కలిగిస్తున్నాయి. అదేవిధంగా పోలీసు స్టేషన్లలో అవినీతి నిర్మూలకు కూడా నిఘా అనివార్యమైన పరిస్ధితి, అన్నింటికి మించి స్టేషన్లలో సిబ్బంది పనితీరు, లాకప్‌ల్లో నిందితుల యోగక్షేమాలు, ముఖ్యంగా పారదర్శకత తదితర అంశాల దృష్ట్యా సీసీ కెమేరాల అవశ్యకత ఎంతైనా ఉందని సుప్రీం కోర్టు భావించింది.
దీంతో దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లలో విధిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గతంలోనే ఆదేశించింది. దేశంలోని ప్రతి పోలీసు స్టేషన్‌లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు స్పెషల్ లీవ్ అప్పీల్ (క్రిమినల్) నెంబర్ 3543/2020 కేసులో 2020 సంవత్సరంలో స ్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ (బడ్జెట్) జిఓ ఆర్‌టి నెంబర్ 937 ద్వారా ప్రతి పోలీసు స్టేషన్‌లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసేందుకు 2021 సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన రూ.26,83,32,000 కోట్లు కేటాయించింది. ఈక్రమంలో రాష్ట్ర డీజీపీ కార్యాలయం 2021 ఫిబ్రవరి 19వ తేదీ ఆర్‌సి నెంబర్ 108/ఎఫ్1/2021 ప్రకారం మెమోరాండం ద్వారా అన్ని స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాని ఏడాది దాటిపోయినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఒకరకంగా చెప్పాలంటే 2019 తర్వాత నుంచి కరోనా కాలం కావడంతో ఇది కూడా ఒక కారణంగా భావించాల్సి వస్తోంది.
ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం
అయితే రాష్ట్రంలో అన్ని పోలీసు స్టేషన్లలో రెండో విడతగా సీసీ కెమేరాలు ఏర్పాటుకు సంబంధించి సుప్రీం ఆదేశాల ప్రకారం రాష్ట్ర హోంశాఖ బడ్జెట్ కేటాయింపు జరిగినా కార్యాచరణకు ఎట్టకేలకు పోలీసు యంత్రాంగం ఉపక్రమించింది. రాష్ట్రంలో 1372 లా అండ్ అర్డర్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. వీటిలో తొలి విడతగా ఐదు కోట్లతో 534 పోలీసు స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అవి స్టేషన్‌కు రెండు, మూడు మాత్రమే ఉండేవి. లాకప్ వరకే పరిమితం కావడంతో కొన్ని పోలీసు స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓల ఆసక్తితో డోనర్ల సౌజన్యంతో మరిన్ని ఏర్పాటు చేసుకున్నారు. లాకప్‌తోపాటు రైటర్ రూము, హౌసాఫీసర్ రూము, సిబ్బంది గది, స్టేషన్ ద్వారం, పరిసరాలు కవర్ అయ్యే విధంగా కొన్ని చోట్ల ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిలో ఏవీ కూడా ఇప్పుడు సమర్ధవంతంగా పని చేసే పరిస్ధితి లేదు. కాని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాల ప్రకారం స్టేషన్‌లో అన్ని విభాగాల్లోనూ సీసీ కెమేరాలు ఉండాలి. దీంతో స్టేషన్‌కు కనీసం పది కెమేరాలు అవసరం. ఈ నేపధ్యంలో 26కోట్ల రూపాయల పైగా బడె ్జట్‌తో రెండో విడతగా 600 పోలీసు స్టేషన్లలో కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ ప్రారంభమైంది.
దీనిలో భాగంగా టెండర్లు పిలవడం, వివిధ సంస్ధలు పాల్గొనడంతో ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపిక చేయబడిన ఏజెన్సీల ద్వారా లాంచనాలన్నీ పూర్తయ్యాక సీసీ కెమేరాలు ఏర్పాటుకు ముందు డెమో జరుగనుంది. నాణ్యత, వాటి సామర్ధ్యం, పనితీరు, సాంకేతిక పరమైన అంశాలు, స్టోరేజ్‌ీ కెపాసిటీ, కొత్త ఫ్యూచర్లు తదితర అంశాలకు సంబంధించి నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించడం జరుగుతుంది. ప్రతి స్టేషన్లోనూ సీసీ కెమేరాలు ఏర్పాటు చేసిన మీదట అవి డీజీపీ కార్యాలయానికి , టెక్‌టవర్‌కు అనుసంధానం చేయబడుతుంది. నూతన పరిఙ్ఞానంలో భాగంగా సీసీ కెమేరాలు పని చేయడం మానేసినా అవాంతరాలు ఏర్పడినా వెంటనే అక్కడికి సంకేతాలు వెళతాయి. అదేవిధంగా సుప్రీం ఆదేశాల ప్రకారం స్ధానిక న్యాయమూర్తి పర్యవేక్షణలో కూడా వీటి పనితీరు కొనసాగుతాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న సీసీ కెమేరాల్లో రికార్డింగ్‌తోపాటు దాదాపు ఏడాదికి పైగా దృశ్యాలను స్టోరేజీ అయ్యేలా ప్రత్యేక వెసులుబాటు ఉండనుంది. మొత్తం మీద నవంబర్, డిసెంబర్ నాటికి స్టేషన్లలో సీసీ కెమేరాలు కొలువు తీరనున్నాయి.