Friday, November 22, 2024

AP: కర్నూలులో టీడీపీ వినూత్న నిరసన.. ఉరి వేసుకుంటూ నిరసన వ్యక్తం చేసిన నేతలు

కర్నూలు: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిత్యవసరాల వస్తువుల ధరలు పెరగడం, వర్షాలు లేక పంటలు ఎండిపోవడం, నిరుద్యోగులకు ఉపాధి లేక పోవడం, నకిలీ మద్యంతో ప్రాణాలు పోవడం, ఇసుక దందా పెరగడంతో పాటు పన్నుల భారం పెరగడంతో రాష్ట్ర ప్రజానీకం ఈ రాష్ట్రంలో బ్రతకలేక తమకు ఉరే గతి అంటూ ఉరి వేసుకుంటున్నారని దీనిని ఖండిస్తూ గురువారం కర్నూలు నియోజకవర్గం పార్టీ ఇన్చార్జీ టీ.జీ.భరత్, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉరి వేసుకుంటూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాన్యులు బ్రతికే స్థితి లేదని, స్వయానా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే ఇసుక మాఫియా నడిపిస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, లిక్కర్ మాఫియా డబ్బు మొత్తం జగన్ ఇంటికి చేరుతుందన్నారు. ఆర్ధిక నేరాలు చేసి జైలు జీవితం గడిపిన వారు 10సంవత్సరాలుగా బయట తిరుగుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించే ప్రజానాయకుడు చంద్రబాబునాయుడు 74ఏళ్ళ వయస్సులో అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం, ఎలాంటి నేర నిరూపణ కాకుండా కేవలం రాజకీయ కక్షతో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచడం, మేసపూరిత ప్రభుత్వ ఎత్తులను చిత్తుచేసి ఆఖరికి నిజాయితీ గెలుస్తుందన్నారు.

వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం అసాంఘీకమని, న్యాయాన్ని నిర్బంధించడమేనన్నారు. రాష్ట్రంలోని 5కోట్ల ప్రజానీకం జగన్ ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని, 2024 ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, అధర్మ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక గుండెపగిలి మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరమర్శిస్తున్నారని, అందులో భాగంగా కర్నూలు జిల్లాలో మరణించిన కార్యకర్తలను కూడా భువనేశ్వరి పరమర్శిస్తారని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవికుమార్, జె. తిరుపాల్ బాబు, సోమిశెట్టి నవీన్, నంది మధు, మహేష్ గౌడ్, ఎల్లప్ప, యస్.అబ్బాస్, సత్రం రామక్రిష్ణుడు, హనుమంతరావు చౌదరి, గున్నా మార్క్ చిన్నమ్మి, సుంకన్న, రవిచంద్ర శర్మ, రమీజ్, పౌల్ రాజ్, తమ్మోజి, అఖిల్, ప్రభాకర్, రమణ, ఇలియాజ్, రామాంజనేయులు, రామక్రిష్ణ మొదలగు వారితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement