అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఐదు నిమిషాల ముందే తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ లోకేశ్‌కు ఇటీవల సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన ఈనెల 4న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉన్నత న్యాయస్థానం సీఐడికి పలు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. విచారణ సమయంలో లోకేశ్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే విచారించాలని మధ్యాహ్నం ఓ గంట భోజన విరామం ఇవ్వాలని సీఐడికి న్యాయస్థానం ఆదేశించింది.
కాగా, హెరిటేజ్ సంస్థకు లబ్ధిచేకూరేలా ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్ మార్చారని సీఐడీ అభియోగాలు మోపింది. లేని, వేయని, కనీసం భూసేకరణ కూడా చేయని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి ఎలా సాధ్యమని టిడిపి నిలదీస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు.. రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో హెరిటేజ్ సంస్థ కేవలం 9 ఎకరాల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటే అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను మార్చిన సిఐడి
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ఇప్పటి వరకు విచారిస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను మార్చారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను మార్చినట్టు ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దర్యాప్తు బాధ్యతల నుంచి అడిషనల్ ఎస్పీ జయరామరాజును తప్పించారు. ఆయన స్థానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్ కు బాధ్యతలను అప్పగించారు. ఇకపై ఈ కేసు దర్యాప్తు అధికారిగా విజయ్ భాస్కర్ వ్యవహరించబోతున్నారు.
మరోవైపు ఈ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను మార్చడం గమనార్హం. లోకేశ్ ను ప్రస్తుతం విచారిస్తున్న అధికారుల్లో జయరామరాజు, విజయ్ భాస్కర్ ఇద్దరూ ఉన్నారు. ప్రస్తుతం జయరామరాజు నేతృత్వంలోనే లోకేశ్ విచారణ కొనసాగుతోంది. భోజనం తర్వాత విజయ్ భాస్కర్ నేతృత్వంలో విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. .