‘రామ్ కీ ఫార్మా సిటీ’ విస్తరణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఫార్మా సిటీ ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల పెంపుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఫార్మా సిటీ సమీపంలో గతంలో కేటాయించిన కంపెనీల స్థాపనకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. బుధవారం ‘రామ్ కీ ఫార్మా సిటీ’పై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా పాల్గొన్నారు. రామ్ కీ ఫార్మా సిటీలో వసతుల కల్పన గురించి ప్రధానంగా చర్చించారు. ‘రామ్ కీ’ ఫార్మా సిటీకి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి ఎంపీ అయోధ్య రామిరెడ్డి తీసుకువెళ్లారు. అయితే, వాటి పరిష్కారానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి హామీ ఇచ్చారు.
రామ్ కీ ఫార్మా సిటీ అభివృద్ధి, వసతుల కల్పనకు పరిశ్రమల శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి మేకపాటి తెలిపారు. కాగా, ఈ సమీక్ష సమావేశానికి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, ఫార్మా కంపెనీల ప్రతినిధులు, తదితరులు హాజరైయ్యారు.