(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : కార్తీక పౌర్ణమి సమయాన కోటి దీపకాంతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలుగుంది. పౌర్ణమి దీపం వెలుగుల్లో ఉన్న అమ్మవారి ఆలయం చూసేందుకు రెండు కళ్ళు సరిపోలేదు అనిపించేలా ఉంది. కోటి కాంతులు విరాజిల్లిన దీపోత్సవంతో ఇంద్రకీలాద్రి సరికొత్త అందాలతో పాటు పూర్తి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి కొండపై శుక్రవారం నిర్వహించిన కోటి దీపోత్సవం అత్యంత వైభవపేత్తంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని లక్ష వత్తుల దీపాన్ని కమిషనర్ సత్యనారాయణ తో పాటు ఈవో కేఎస్ రామారావు వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణం తో పాటు రావిచెట్టి ఉపాలయాలు రాజగోపురం ఎదుట మహా మండపం, రాజగోపురం గోశాల కనకదుర్గ నగర్ మల్లేశ్వర స్వామి వారి ఆలయం లక్ష్మీ గణపతి ప్రాంగణం ఇలా ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి ఒక్క ప్రాంతంలో భక్తులు దీపాలను వెలిగించారు.
భక్తిశ్రద్ధలతో జ్వాలా తోరణం…
కార్తిక పౌర్ణమి రోజు అత్యంత ప్రాముఖ్యత కలిగిన జ్వాలాతోరణాన్ని భక్తిశ్రద్ధల మధ్య భక్తుల సమక్షంలో మంత్రి అనిత ఇతర దేవాదాయ శాఖ అధికారులు కలిసి వెలిగించారు. ఆలయ మహా మండపం ఏడవ అంతస్తు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్వాలాతోరణాన్ని వెలిగించిన అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో నమస్కరించి హారతులను స్వీకరించారు.