Friday, November 22, 2024

Indrakeeladri – రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ అనుగ్రహం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు..

విజయ దశమి, ఉత్సవాల చివరి రోజు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శనివారం రాత్రి నిర్వహించే తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజశుద్ధ దశమి అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు. స్వరూపిణీ మహాత్రిపురసుందరీ, శ్రీ చక్ర అధిష్టాన దేవత ఈ రాజరాజేశ్వరీదేవి. దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ముగిసిన తరువాత జరుపుకొనే విజయదశమి, అపరాజితాదేవి పేరుమీద ఏర్పడిందని పండితులంటారు.

- Advertisement -

ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి వివిధ కల్పాలలో నానావిధ దుష్టదనుజుల్ని, వివిధ రూపాలు ధరించి సంహరించి లోకానికి ఆనందాన్ని కలిగించింది. ఇలా ఎక్కడా ఆమెకి అపజయమే లేదు కాబట్టి ఆమె అపరాజితా అయ్యింది.

ఎప్పుడూ విజయాన్ని సాధించేది కాబట్టి విజయా అని కూడా పిలుస్తాం. అత్యంత మహిమోపేతమైన శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవే రాజరాజేశ్వరి. శ్రీ మన్మణిద్వీప శ్రీనగరస్థిత చింతామణి గృహం ఆమె నివాసమట. అక్కడ ఆమె సమస్తాంగాయుధావరణ నిత్యామ్నాయ పరివార దేవతా సహితంగా శ్రీ మహాకామేశ్వరుడి అంకాన్ని నిలయంగా చేసుకుని ఉంటుందట. అటువంటి ఆదిపరాశక్తి మహా త్రిపురసుందరి శ్రీ రాజరాజేశ్వరి పరాభట్టారికాదేవి. పరమశాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండాన్ని (చెరకుగడ) చేతిలో ధరించి ఒక చేత అభయముద్రని చూపిస్తూ ఈ దసరా మహోత్సవాల్లో మనకి దర్శనమిస్తుంది. అపరాజితాదేవి స్వరూపమైన రాజరాజేశ్వరీదేవిని దర్శిస్తే అపజయమే ఉండదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement