Thursday, October 3, 2024

Indrakeeladri – బాలా త్రిపుర సుంద‌రి అలంకారంలో భ‌క్త‌ల‌కు దుర్గ‌మ్మ అనుగ్ర‌హం

విజ‌య‌వాడ – కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు నుండి 12వ తేదీ వరకూ రోజుకో అలంకారంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగుబంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయం, పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు.

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్

ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు తన చేతుల మీదగా జరగడం చాలా సంతోషంగా ఉందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. దేవీ నవరాత్రుల ప్రారంభ సందర్భంగా సిపి దంపతులు దుర్గమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పించారు. తన కుటుంబంతోపాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

భారీ బందోబస్తు నడుమ..

ఈ ఉత్సవాల్లో నిత్యం లక్షకుపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారని అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా దాదాపు నాలుగున్నర వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఆలయం వద్ద భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరో పక్క ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలను భక్తులు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకుచ్చారు.

- Advertisement -

ఇబ్బంది లేకుండా దర్శనాలు: ఆనం

ఇదిలా ఉండగా… దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ కోసం ప్రత్యేకంగా సాంగ్‌ను రూపొందించారు. గురువారం ఉదయం మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్ధసారథి పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగతా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. దేవి నవరాత్రులను అద్భుతంగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్‌లు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఇవాళ దర్శనాలు సజావుగా ప్రారంభమయ్యాయని సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. లక్షలాదిగా భక్తులు అమ్మవారి దర్శన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 100, 300, 500 రూపాయల క్యూలైన్లు ప్రారంభించారని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌ల సమన్వయంతో వాహనాలను పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతీఒక్కరికి అన్నప్రసాదం, అన్ని ప్రసాదాలు అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు మూల నక్షత్రం రోజు అంటే 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సకుటుంబసమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.

నేటి నుంచి కృష్ణాఘాట్ లో న‌వ హారతులు ..

శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌కు రాష్ట్ర గవర్నర్, ఛీఫ్ జస్టిస్, ప్రధాన కార్యదర్శిలను ఆహ్వానించామని ఆనం చెప్పారు. అలాగే నవహారతులు తిరిగి ప్రారంభించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. దుర్గాఘాట్‌లోనే నవహారతులను ఈరోజు నుంచీ ప్రతీ నిత్యం జరుపుతామన్నారు. ముంబై వజ్రాల కిరీటాన్ని అమ్మవారికి సౌరభ్ గౌర్ ఇస్తారని.. వజ్రాల సూర్య చంద్రులను అమ్మవారికి సీ.ఎం.రాజేష్‌ సమర్పిస్తారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి హైమవతి, సూర్యకుమారి వజ్రాల బొట్టును అమ్మవారికి ఇస్తున్నారని చెప్పారు. ఇవి ఇప్పటికే దేవాదాయశాఖకు అందాయని ఇవాళ ఈ ఆభరణాలను అమ్మవారికి సమర్పించామ‌ని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వెల్లడించారు. అమ్మవారిని ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేలా ఏర్పాటు చేశారని సమాచార శాఖా మంత్రి పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరాలని అమ్మవారిని కోరుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement