విజయవాడ: దసరా సందర్బంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవ రాత్రులలో తొలి రోజు బాలా త్రిపుర సుందరిగా, రెండో రోజు గాయత్రిదేవిగా భక్తుల పూజలందుకున్న ఆ జగన్మాత మూడో రోజు అమ్మవారిని అన్నపూర్ణా దేవి రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు.
మూడోరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజలందుకోనుంది.
ఆది పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి ‘భిక్షాందేహి కృపావలంబన కరీ, మాతాన్నపూర్ణేశ్వరీ!’ అని ప్రార్థిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అన్నం పరబ్రహ్మస్వరూపం. సకల జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించాలని అన్నపూర్ణ దేవిని వేడుకుంటారు. అంతేకాదు ఈ రోజునే తల్లులందరూ స్తనవృద్ధి గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు
అన్నపూర్ణ దేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, కట్టె పొంగలి, దధ్యోజనం నైవేద్యంగా పెడతారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. మరోవైపు శరన్నవరాత్రుల్లో భాగంగా నాడు మూడో రోజు చంద్రఘంట మాతను ఆరాధిస్తారు. దుర్గా దేవి మూడో రూపమే చంద్రఘంట దేవి.
చంద్రఘంట మాత పూజ చేసే వారు ఎక్కువగా ఎరుపు, నారింజ రంగులను ఉపయోగిస్తారు. ఎర్ర చందనం, ఎర్ర చున్ని, ఎర్రని పువ్వులు, ఎర్రని పండ్లను నైవేద్యంగా నివేదిస్తారు. అలాగే చంద్రఘంట అమ్మవారికి పాలతో చేసిన తియ్యని పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ .