విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజైన నేడు దుర్గమ్మ మహిషాసురమర్థినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. మహిషాసురమర్థిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు బారులు తీరారు.
అష్టభుజాలతో దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది ఈ రూపంలోనే. నవదుర్గల్లో అత్యుగ్రరూపమని పండితులు చెప్పారు. జగన్మాత లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి, ఆయుధాలను ధరించి మహాశక్తిగా భక్తులను అనుగ్రహిస్తుంది. దేవీ నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధనవమి తిథిని మహర్నవమిగా పిలుస్తుంటారు. ఎనిమిది రోజుల యుద్ధం అనంతరం దుర్గమ్మ నవమి రోజున మహిషాసురుడిని సంహకరించి.. లోకాలకు ఆనందాన్ని చేకూర్చింది.
అమ్మవారి అవతారాలన్నింటిలోనూ దుష్టశిక్షణ చేసినా మహిషాసురమిర్థిని అత్యంత ఉగ్రంగా ఉంటుంది. దేవతలు చేసిన చిద్యాగకుండం నుంచి వెలుగుముద్దగా ఆవిర్భవించి.. సకల దేవతల అంశలను గ్రహించి, వారిచ్చిన ఆయుధాలతో దున్నపోతు మనస్తత్వం మూర్తీభవించిన మహిషాసుడిని సంహరించింది. సింహవాహనంపై, ఉగ్రరూపంతో, అష్టభుజాలతో పాశం, అంకుశం, త్రిశూలం తదితర ధరించి దర్శనమిచ్చే మహాశక్తిని పూజిస్తే శత్రుభయం ఉండదు భక్తుల నమ్మకం.