విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూల నక్షత్రమైన నేడు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయన వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు, మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. అంతకుముందు ఆలయం వద్ద సీఎంకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.. ఆ తర్వాత ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు..
విజయదశమి శుభాకాంక్షలు…
ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమ్మవారి జన్మనక్షత్రమైన ఈరోజున ఆమెను దర్శించుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తిరుమల తర్వాత రెండో అతి పెద్ద దేవాలయం విజయవాడ దుర్గగుడి అని అన్నారు.
దేవాలయాల పవిత్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చంద్రబాబు చెప్పారు. దుర్గ గుడిలో ఈసారి ఉత్సవ కమిటీని కాకుండా… సేవా కమిటీని వేశామని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు 67,931 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. త్వరలోనే నదుల అనుసంధానం ఉంటుందని తెలిపారు. ఈ పనులన్నీ త్వరలోనే పూర్తికావాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.
మరోవైపు, దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చిన్నరాజగోపురం వద్ద ముఖ్యమంత్రి తలకు అర్చకులు పరివేష్టం చుట్టారు. ఆ తర్వాత మేళతాళాల మధ్య అమ్మవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.