Saturday, November 23, 2024

Delhi: క్లీన్ సిటీగా ఇండోర్‌ డబుల్ హ్యాట్రిక్.. టాప్10లో ఏపీ నుంచి మూడు నగరాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఆరవసారి మొదటి స్థానంలో నిలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించింది. తాజాగా ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డుల్లో ఇండోర్ నగరానికి పట్టం కట్టారు. సూరత్, నవీ ముంబై నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డ్స్ 2022 అవార్డులను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరసగా ఆరోసారి ఇండోర్ నగరం నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, మహారాష్ట్రలోని నవీ ముంబై నిలిచాయి. గతేడాది మూడో స్థానంలో ఉన్న విజయవాడ తన ర్యాంకును కోల్పోయింది. టాప్ 10 జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు ఉన్నాయి. విశాఖపట్నం నాలుగోస్థానంలో ఉండగా.. విజయవాడ ఐదు, తిరుపతి ఏడో స్థానంలో నిలిచాయి.

పరిశుభ్రత విషయంలో రాష్ట్రాల విభాగంతో మధ్యప్రదేశ్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. తరువాతి స్థానంలో ఛత్తీస్ గఢ్, మూడో స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి. 100 కన్నా తక్కువ పట్టణ స్థానిక సంస్థలు కలిగి ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఈ అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు.

లక్ష కన్నా తక్కవ జనాభా తక్కువ ఉన్న పట్టణాల జాబితాలో మహారాష్ట్రలోని పంచగని నెంబర్ వన్ గా నిలవగా.. తర్వాతి స్థానంలో ఛత్తీస్ గఢ్ లోని పటాన్(ఎన్పీ), మహారాష్ట్రలోని కర్హాద్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. లక్షకు పైబడి జనాభా ఉన్న గంగానదీ పరివాహక పట్టణాల్లో హరిద్వార్ శుభ్రత విషయంలో తొలిస్థానంలో నిలిచింది. వారణాసి, రిషికేష్ తరువాతి స్థానాల్లో నిలిచాయి. లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న గంగా నది పట్టణాల్లో పీటీఐ బన్ బిజ్నోర్ తొలిస్థానంలో నిలవగా.. కన్నౌజ్, గురుముక్తేశ్వర్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

- Advertisement -

దేశంలో పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుగా మహారాష్ట్రలోని డియోలాలి తొలిస్థానంలో నిలిచింది. పరిశుభ్రత ఆధారంగా ప్రతీఏడు స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్) స్వచ్ఛ్ సర్వేక్షన్ ర్యాంకింగ్స్ ప్రకటిస్తోంది. పరిశుభ్రత, పారశుద్ధ్యం వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని ర్యాకింగ్స్ కేటాయిస్తోంది. ప్రస్తుతం ఏడో విడత అవార్డులను ప్రకటించింది. సర్వేక్షన్ 2016లో 73 నగరాలతో ప్రారంభం అయి ప్రస్తుతం దేశంలోని 4354 నగరాలను పరిశుభ్రతను అంచనా వేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement