ఇండియాలో కరోనా కేసులు స్వల్ప విరామం తీసుకుని మళ్లీ విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య చాప కింద నీరులా పెరుగుతున్నాయి. దీంతో థర్డ్ వేవ్ పై అంచనాలు అందరి మదిలో మెదులుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ఆగస్టు నెలలో ప్రారంభమై సెప్టెంబర్ లో పీక్స్ కు చేరుతుంది అన్న నిపుణుల అంచనా నిజమవుతుందా అన్న ఆందోళన ప్రస్తుతం అందరినీ వేధిస్తుంది. ఇక కేరళ, మహారాష్ట్రతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్న తీరు, ఆసుపత్రుల్లో పెరుగుతున్న చేరికలు ఆందోళనకరంగా మారాయి. అధికారిక లెక్కల కంటే అనధికారికంగా చాలామంది కరోనా బారిన పడుతున్నట్టు ఆసుపత్రుల్లో పెరుగుతున్న రద్దీ స్పష్టం చేస్తుంది. ఇక భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తప్పకవస్తుందనీ… ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పలేమని సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మండలి (CSIR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ అన్నారు. వ్యాక్సిన్, సేఫ్ డిస్టాన్స్, మాస్క్ మాత్రమే ప్రజలను కాపాడతాయని చెప్పారు. కేరళలో రోజూ 20వేలకు పైగా కేసులు వస్తుండటంపై రీసెర్చ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇండియాలో మళ్లీ డెల్టా వేరియంట్ విరుచుకుపడే ప్రమాదం ఉందన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం అప్రమత్తం చేసింది. కొన్ని సర్వేలు అక్టోబర్ నెలలో థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందని గతంలో నిపుణులు పేర్కొన్నప్పటికి.. థర్డ్ వేవ్ ఈ నెలలోనే ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి, రెండో వేవ్‌ల మధ్య వచ్చిన గ్యాప్, తీవ్రత, కేసుల పెరుగుదల ఆధారంగా థర్డ్ వేవ్‌ను అంచనా వేస్తున్నారు. సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టావేరియంట్, థర్డ్ వేవ్‌కు కూడా కారణం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం డెల్టావేరియంట్ అమెరికా, జపాన్, మలేషియా, ఇరాన్‌తో పాటుగా ప్రపంచంలోని 130 దేశాల్లో వ్యాపించింది. ఈ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రపంచంలోని అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇక ఏపీలో జూలై 20వ తేదీ నుంచి రోజుకు సగటున 594 మంది ఆసుపత్రులలో చేరుతున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూలై 2వ తేదీ నుండి 11వ తేదీ మధ్య సగటున 197 మంది ఆస్పత్రిలో చేరగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సుమారు 600 వరకు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటుగా కేంద్రం పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు నిత్యం చూస్తూనే ఉన్నాం.
ఇక తెలంగాణలోనూ పరిస్థితి ఇంచుమించు అదేవిధంగా ఉంది. మళ్లీ కరోనా ఆసుపత్రులలో చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో ఆసుపత్రులలో కరోనా కేసుల రద్దీ పెరుగుతోంది అయినప్పటికీ ఇవి బయటకు రాకుండా, అధికారిక లెక్కలలో తక్కువ కేసులు నమోదైనట్లుగా చూపిస్తున్నట్లుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి పెద్దగా చర్యలు తీసుకోవటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఏది ఏమైనా ముప్పు ముంగిట్లో మనం ఉన్నట్లుగా ప్రస్తుతం పెరుగుతున్న కేసుల తీరు స్పష్టంగా చెబుతోంది. ఈ సమయంలో కూడా అప్రమత్తంగా లేకుంటే సెకండ్ వేవ్ ను మించి థర్డ్ వేవ్ విధ్వంసం సృష్టించే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త . మాస్కులు ధరించటం , సామాజిక దూర నిబంధనలు పాటించటంతో పాటు వ్యాక్సినేషన్ చేయించుకోవటం తప్పనిసరి అని నిపుణుల సూచనలు పాటిద్దాం.
ఇది కూడా చదవండి: ఆ 10 రాష్ట్రాలకూ కేంద్రం హెచ్చరిక