- రోజ్ గార్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు….
- ఉద్యోగలకు నియామక పత్రాలు అందజేత…
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలతో పాటు ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో మన దేశం మరింత ధృడంగా ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో ఎదుగుతుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన (పి.ఎం.ఆర్.వై) ప్రధాన మంత్రి రోజ్ గార్ మేళా ట్రాంచ్ -1 (ఫేస్ -ll) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావుతో ఎంపీ కేశినేని శివనాథ్ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించిన మొత్తం 185 మందికి నియామక పత్రాలు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఇవ్వటం జరిగింది. విజయవాడ పరిధిలో 151 మంది పోస్టల్ డిపార్ట్మెంట్, రైల్వే స్ నుండి 10 మంది,స్కూల్ అఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ 15 మంది , ఎఫ్.సి.ఐ నుండి ఆరుగురికి, ఐ.వో.బి నుండి ముగ్గురికి నియామక పత్రాలు అందించటం జరిగింది. నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగస్తులకు ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం నిత్యావసర వస్తువులు ఎగుమతి చేసే స్థాయికి భారత్ దేశం ఎదిగిందన్నారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం రోజ్ గార్ మేళాలో అపాయింట్ మెంట్ లెటర్స్ పొందినవాళ్లు పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బొండా మాట్లాడుతూ… ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశంలో పలు రంగాలు దృఢంగా అవుతున్నాయన్నారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ, రోజ్ గార్ మేళా కార్యక్రమాలతో యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఒకే రోజు 51 వేల మందికి ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వటం ఎప్పుడు చూడలేదని..ఇదొక రికార్డ్ అని చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్ దేవిరెడ్డి శ్రీధర్ మూర్తి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కే.ప్రకాష్, రైల్వే డి.ఆర్.ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, బి.ఎస్.ఎన్.ఎల్ మేనేజర్ ఎం.శేషాచలం పాల్గొన్నారు.