Wednesday, November 20, 2024

Independence day – ఎపిలో గ్రామ స్వ‌రాజ్యం తీసుకొచ్చిన ఘ‌న‌త మాదే – జ‌గ‌న్

విజ‌య‌వాడ‌: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హించింది. విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌, వైయ‌స్ భార‌తి దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్య‌మంత్రి ఆవిష్క‌రించారు. ప్ర‌జ‌లంద‌రికీ 77వ స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం సాయుధ ద‌ళాల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా అధికారుల‌కు జ‌గ‌న్ మెడ‌ల్స్ ప్ర‌దానం చేశారు.

అనంతరం జగన్‌ మాట్లాడుతూ, ”గాంధీజీ ఇచ్చిన అహింస, శాంతి సందేశాన్ని.. భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ సాహసాన్ని.. టంగూరి, అల్లూరి, పింగళి త్యాగనిరతిని.. లక్షలాది సమరయోధుల బలిదానాన్ని గుర్తుచేస్తూ మన జాతీయ జెండా ఎగురుతోంది. ఈ జెండాకు రాష్ట్ర ప్రజల తరఫున సెల్యూట్‌ చేస్తున్నాం” అని అన్నారు.

50 నెలల తమ ప్రభుత్వ పాలనలో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని జగన్‌ చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని గొప్ప మార్పు ఇది అని వివరించారు. ”ఆక్వా రైతులను రూ.1.50కే విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వం మనదే. పాడి రైతులకు పాలవెల్లువ కార్యక్రమం తీసుకొచ్చాం. మూతబడిన చిత్తూరు డెయిరీతో పాటు సహకార సంఘాలకు జీవం పోశాం. భూవివాదాల ఆస్కారం లేకుండా రైతన్నకు మంచి చేస్తున్నాం. 1.54లక్షల ఎస్టీ రైతులకు 3.23లక్షల ఎకరాల్లో పట్టాలు పంపిణీ చేశాం. ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. వంశధార ఫేజ్‌-2, వంశధార- నాగావళి అనుసంధానం పనులు చేపట్టాం. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025 జూన్‌ నాటికి పోలవరం పూర్తిచేస్తాం. వెలుగొండ మొదటి టన్నెల్‌ పూర్తిచేశాం.. రెండో టన్నెల్‌ పనులు త్వరలోనే పూర్తవుతాయి” అని జగన్‌ అన్నారు.

వైద్యరంగంలో నాడు- నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. గత 100 ఏళ్లలో రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే.. ఈ నాలుగేళ్లలోనే ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. ఈ 50 నెలల్లో వైద్యశాఖలో రికార్డు స్థాయిలో 53,126 పోస్టులు భర్తీ చేశాం. ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. చికిత్స ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేయడంతోపాటు సేవలను 1036 నుంచి 3255 విస్తరించాం. అని తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement