అమరావతి: ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. మహోజ్వల చరిత గల మన దేశ సమగ్రతను కాపాడటం అందరి కర్తవ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. ‘ఇంటింటా జాతీయ జెండా’ అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయమని తెలిపారు.
తెలుగువారైన పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జెండా ప్రతి ఇంటిపై రెపరెపలాడటం మనకు మరింత ప్రత్యేకం, గర్వకారణమని కొనియాడారు. ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. జాతీయ జెండాను సోషల్ మీడియా పేజీల్లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలన్నారు. ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయని, స్ఫూర్తిని నింపుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.