అమరావతి, ఆంధ్రప్రభ : ఎండలతో పాటే విద్యుత్ వాడకం కూడా పెరిగిపోతోంది. ఈ ఏడాది మార్చి మొదటి వారం నుంచే మండుటెండలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సాధారణం కంటే 2-4 డిగ్రీలు అధికంగా (40 డిగ్రీలకు పైగా) ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యలో ఒకింత తగ్గినట్లు అనిపించినా పది రోజులుగా మళ్లీ సెగలు మొదలయ్యాయి. సరఫరాకు మించి డిమాండ్ నెలకొనడంతో పవర్ ఎక్చేంజ్‌లో యూనిట్ రూ.8.20 వరకు వెచ్చించి అత్యవసరంగా అప్పటికప్పుడు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది ప్రభుత్వానికి ఎంతో భారమైనప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వెచ్చిస్తోంది. గత సంవత్సరం కోవిడ్ ప్రభావం వల్ల డిమాండ్ లేకపోవడంతో మార్కెట్లో కాస్త చౌకగానే విద్యుత్ లభ్యమైంది.
లభ్యత ఇదీ..
రాష్ట్రంలో ఏపీ హైడెల్ నుంచి 1,728 మెగావాట్లు, ఏపీ థర్మల్ నుంచి 5,010, జాయింట్ సెక్టార్ నుంచి 34, సెంట్రల్ సెక్టార్ నుంచి 2,403, ప్రైవేటు సెక్టార్ (గ్యాస్) నుంచి 1,492, ప్రైవేటు సెక్టార్ (విండ్) నుంచి 4,179, ప్రైవేటు సెక్టార్ (సోలార్) నుంచి 3,800, స్టేట్ పర్చేజెస్ ద్వారా 631, ఇతరుల ద్వారా 585 వెరసి 19,862 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉంది. ఈ సంవత్సరం 11,991 మెగావాట్ల డిమాండ్ ఉంటుందని, సగటున మార్చిలో రోజుకు గ్రిడ్ డిమాండ్ 228 మిలియన్ యూనిట్ల వినియోగం అవుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. గత ఏడాది మార్చి 26న పవర్ గ్రిడ్ డిమాండ్ 219.334 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈ ఏడాది మార్చి 26న 228.428 మిలియన్ యూనిట్లు ఉంది.
ఏప్రిల్ 15 తర్వాత ఊరట..
విద్యుత్ డిమాండ్‌కు ఏప్రిల్ 15 తర్వాత కాస్త ఉపశమనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అప్పటికి వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. రోజుకు సగటున వినియోగం 223 మిలియన్ యూనిట్లకు తగ్గవచ్చని పేర్కొంటున్నారు. అయితే వేసవి తీవ్రత పెరిగితే మళ్లీ డిమాండ్ అధికమయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం లేకపోలేదంటున్నారు.
వృథా నివారించాలి..
సరఫరాకు మించి డిమాండ్ పెరుగుతున్నందున వినియోగదారులు విద్యుత్ వృథా నివారించాలి. అత్యవసరమైనవి మినహా ఇతర విద్యుత్ ఉపకరణాలను వాడవద్దు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు విద్యుత్ వాడకంలో నియంత్రణ పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..