అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులలో రక్తహీనత (అనీమియా) బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రతి పభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరుతోపాటు రక్తపరీక్షల రిపోర్టును ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. రక్త పరీక్షలు నిర్వహించిన అనంతరం మూడు దశల్లో రిపోర్టులను నమోదు చేస్తారు. తేలికపాటి (మైల్డ్), మోస్తరు (మోడరేట్), తీవ్రమైన (సివియర్). సివియర్‌గా నమోదవుతున్న వారిలో అధిక శాతం బాలికలు ఉంటున్నారు.
ఈ రిపోర్టుల ప్రకారం పాఠశాలల్లో చదివే బాలుర కంటే బాలికలలో అత్యధికంగా రక్తహీనత బాధితులు వెలుగులోకి వస్తున్నారు. మోస్తరు, తీవ్రమైన దశలను గుర్తించిన వారికి ఐరన్ పోలిక్ యాసిడ్ మందులను పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. పూర్తి స్థాయిలో నివారణా చర్యలు తీసుకోకపోవడంతో తీవ్రమైన (సివియర్) దశలో ఉండే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
గతేడాది జాతీయ కుటు-ంబ ఆరోగ్య సర్వే 5 (ఎన్‌హెచ్‌ఎస్) ప్రకారం రాష్ట్రంలో ఆరు గ్రూపులలో ఆరు నుంచి 59 నెలల లోపు చిన్నారులలో 63.2 శాతం, 15 నుంచి 19 సంవత్సరాలలోపు బాలికల్లో 60.1 శాతం, బాలురలో 18.7 శాతం రక్తహీనత లోపం ఉంది. శరీరంలో ఇనుము లోపం వలన కూడా ఇది ఏర్పడుతుంది. ఇనుము లోపం శారీరక దృఢత్వాన్ని తగ్గిస్తుంది, ఇది విద్యా పనితీరును ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దీర్ఘకాలంలో, ఇది తల్లి మరియు పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరియు వ్యాధి యొక్క భారాన్ని మరింత పెంచుతుంది. ఎదుగుదలకు పోషకాహార అవసరాల కారణంగా కౌమారదశలో ఇనుము అవసరం పెరుగుతుంది. సహజంగా బాలికలకు రుతుక్రమం సమయంలో అధికంగా రక్తంపోవడాన్ని చాలామంది తేలికగా తీసుకుంటారు. కాని అధికమొత్తంలో రక్తస్రావం కావడం వల్ల రక్తహీనత ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇది భవిష్యత్తులో సురక్షితమైన మాతృత్వానికి ముప్పుగా వాటిల్లుతుంది. రక్తహీనతను నివారించడం లక్ష్యంగా చేసుకునే కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నప్పటికీ ఎక్కువ దృష్టి గర్భిణీ, పాలిచ్చే తల్లులు, శిశువులు, చిన్నపిల్లలపైనె పెడుతున్నారు. అందువల్ల, యుక్తవయస్సులో ఉన్న బాలికలలో అధిక శాతం మంది రక్తహీనత బారిన పడుతున్నారు.
రక్తహీనతకు కారణాలు….
- అనంతపురం, విశాఖపట్నం జిల్లాలో బాలికా విద్యార్థినులలో రక్తహీనత ఎక్కువగా ఉండడానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి.
- పేలవమైన పోషకాహారం తీసుకోవడం : ఆకు కూరలు, చిక్కుళ్ళు ఐరన్-రిచ్ ఫుడ్స్ వంటి ఆహారం తీసుకోకపోవడం వలన ఇనుము లోపించి అనీమియాకు దారి తీస్తుంది.పరిమిత అవగాహన : సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యత, రక్తహీనత ప్రమాదాల గురించి అవగాహన లేకపోవడం వల్ల అనీమియా బారిన పడుతున్నారు.
- సామాజిక ఆర్థిక కారకాలు : ఆర్థికపరమైన ఇబ్బందులు, పేదరికం వలన పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడంతో సమస్య మరింత తీవ్రతరమవుతుంది.
- రుతుక్రమం : రుతుక్రమం సమయంలో ఐరన్ కోల్పోవడం వల్ల రజస్వల అయిన అమ్మాయిలు రక్తహీనతకు గురవుతున్నారు.
పోషకాహార విద్యను మెరుగుపరచాలి…
అనంతపురం జిల్లాలో రక్తహీనతను ఎదుర్కోవడానికి, పోషకాహార విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కీలకం. ఐరన్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించాలి. పాఠశాలల్లో సమగ్ర ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలి. ఈ కార్యక్రమాలలో సాధారణ ఆరోగ్య పరీక్షలు, పోషకాహార కౌన్సెలింగ్, రక్తహీనత ప్రమాదంలో ఉన్న విద్యార్థులకు ఐరన్ సప్లిమెంట్లను అందించడం వంటి చర్యలు తీసుకోవాలి.
స్థానిక ఆరోగ్య అధికారులు, ఉపాధ్యాయులు, హెల్త్ కమ్యూనిటీ- సిబ్బంది మధ్య సమన్వయం అవసరం. కలిసి పని చేయడం ద్వారా, ఆరోగ్య శిబిరాలు, అవగాహన డ్రైవ్‌లు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పించడంతో పాటు సహా రక్తహీనతను పరిష్కరించడానికి సులువుగా ఉంటుంది.
పటిష్టమైన రక్తహీనత నివారణ, నిర్వహణ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం వనరులు, నిధులను కేటాయించాలి. రక్తహీనతను సమర్థవంతంగా పరిష్కరించడానికి పోషకాహార కేంద్రాలను ఏర్పాటు- చేయడం, అవగాహన ప్రచారాలను నిర్వహించడం, ఆరోగ్య సంరక్షణ నిపుణుల నియమించడం వంటి చర్యలు తీసుకోవాలి.