Friday, November 22, 2024

Big story | పెరిగిన కౌలు ధరలు.. ప‌త్తి, మిర్చి సాగు చేసే భూములకు గిరాకీ

అమరావతి, ఆంధ్రప్రభ : వాణిజ్య పంటలకు ధరలు ఆశాజనకంగా వుండడంతో భూముల కౌలు క్రమేణా పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లుగా వరికి గిట్టు బాటు ధరలు లేక పోవడంతో మాగాణి భూములకు గిరాకీ తగ్గింది. ప్రధానంగా గత రెండేళ్లుగా మాగాణి భూముల సాగుకు రైతులు, కౌలు దారులు సుముఖత వ్యక్తం చేయలేదు. గతంలో ఎకరాకు కౌలు కింద సుమారు పది బస్తాల ధాన్యం కౌలు కింద ఇచ్చేవారు. గత రెండేళ్లుగా 2 బస్తాలకు మించి కౌలు ఇవ్వడానికి ముందుకు రాలేదని, దీంతో వందలాది ఎకరాలు వరి సాగు లేక మాగాణి భూములు ఖాళీగా ఉన్నాయి. అయితే బియ్యం ధరలు అనూహ్యంగా పెరగడంతో ఈ సంవత్సరం వరి సాగు చేసేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు.

ఇదిలావుండగా గత రెండేళ్లుగా మిర్చి, పత్తి, పొగాకు, అపరాలు తదితర వాణిజ్య వుత్పత్తుల ధరలు ఆశాజనకంగా వుండడంతో రైతులు వీటి సాగు పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. దీంతో మెట్ట సాగు పొలాలకు గిరాకీ ఏర్పడింది. ప్రధానంగా మిర్చి ఎక్కువగా పండించే మండలాల్లో అధిక దిగుబడులు సాధించే గ్రామాల్లో కౌలు ధరలు బాగున్నాయి. కాలువల పక్కనే సాగునీటి సమస్య లేని భూములు సాగుకు రైతులకు ఇష్టపడుతున్నారు. పంట చివర్లో కాలువల్లో ప్రవాహం తగ్గితే ఒక ఇంజిన్‌తో నేరుగా పొలంలోకి నీరు పడేలా ఉన్న పొలాలకు ఎక్కువ కౌలు చెల్లించి సాగుకు సిద్ధమవుతున్నారు. కాలువకు దూరంగా ఉంటూ ట్యూబులు, ఇంజిన్లకు ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సి రావడంతోపాటు శ్రమ కూడా ఎక్కువేనని రైతులు చెబుతున్నారు.

- Advertisement -

మిర్చి పంటకు ఆఖరి రెండు తడులు కీలకమైనందున సాగునీటి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. గతేడాది పంటను కాపాడుకున్నవారికి గరిష్ఠంగా ఎకరానికి రూ.2 లక్షల వరకు లబ్ధి పొందారు. విత్తనం నుంచి కోత పూర్తయ్యే సమయానికి ఎకరాకు రూ.2లక్షల వరకు పెట్టుబడి అవుతున్నా రైతులు వెనుకాడటం లేదు. సాగర్‌ కాలువలు, ఛానల్‌ పక్కనే పొలాలు ఎకరం కౌలు రూ.లక్ష పలికింది. సమీపంలో ఉన్న పొలాలు రూ.90 వేలు, కాలువ నుంచి దూరం పెరిగే కొద్దీ కౌలు ధర తగ్గుతోంది. ఇలా ఎకరం కనీసం రూ.60వేలు వరకు ధర పలకడం విశేషం. గతంలో గరిష్ఠంగా రూ.70వేలు వరకు ఏడాదికి చెల్లించేవారు.

మిర్చికి అనుకూలమైన పొలాలు కావడం, ఒక ఇంజిన్‌తో పొలానికి నీరు అందించే వెసులుబాటు ఉండటంతో కౌలు రైతులు మొగ్గుచూపుతున్నారు. పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నీటి పారుదలను బట్టి ఎకరం రూ.50 వేల నుంచి రూ.80వేల వరకు కౌలు ధరలు ఉన్నాయి. ఇ కాలువ నీరు అందుబాటు-లో ఉండటం, మిర్చి ఎక్కువగా సాగు చేస్తున్న పొలాలకు డిమాండ్‌ ఉంది. కొన్ని ప్రాంతాల్లో మిర్చి పండించే పొలాలకు మాత్రమే డిమాండ్‌ ఉంది. కొన్ని మండలాల్లో బత్తాయి, నిమ్మ తోటలు తీసేసి మిర్చి సాగు చేస్తున్నారు.

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో

మిర్చి పండే పొలాలకు గతంలో ఎకరం భూమికి రూ. 20వేలు కౌలు చెల్లించేవారు. ఇప్పుడు అదే పొలాలకు రూ.40వేల వరకూ కౌలు ఒప్పందాలు జరుగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో ఎత్తిపోతల పథకాల కింద పొలాలకు సాగునీరు అందుతోంది. ధరణికోట, దిడుగు, మల్లాది గ్రామాల్లో ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటి సౌకర్యం ఉన్న మిర్చి పొలాల ఎకరం కౌలు రూ.30వేల వరకు ధర పలుకుతోంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పెదకూరపాడు, లగడపాడు, కన్నెగండ్ల గ్రామాల పరిధిలో అమరావతి మేజరు కాలువ కింద ఉన్న ఆయకట్టులో మిర్చి పండే పొలాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. గతంలో ఇక్కడ ఎకరం కౌలు రూ.20వేలలోపు ఉండగా, ఈ ఏడాది ఎకరం రూ.25వేల నుంచి రూ.28వేల వరకు నడుస్తోంది.

ఈ మండలంలో ఐటీ ఇంజినీర్లు కొందరు సమూహంగా ఏర్పడి ఎకరం రూ.30వేల చొప్పున 50 ఎకరాలు తీసుకుని మిర్చి సాగుకు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మందపాడు గ్రామం మిరప సాగుకు ప్రసిద్ధి. ఇక్కడ ఎకరానికి 30 క్వింటాళ్లపైగా దిగుబడి సాధిస్తున్నారు. దీంతో ఇక్కడ కౌలు ధరలు ఎకరం రూ.70వేల వరకు పలుకుతున్నాయి. మంచి నేలలు, అనుకూలమైన వాతావరణం, మేలైన సాగు విధానాల వల్ల దిగుబడులు బాగున్నాయని రైతులు చెబుతున్నారు. 1985 తర్వాత మిరప సాగు బాగా పెరిగిందని రైతులు తెలిపారు. ఒకరికొకరు పోటీపడి శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటిస్తూ మేలైన సాగు విధానాలతో పంట పండిస్తున్నామన్నారు.

దిగుబడులు కూడా బాగుండటం, ధర ఆశాజనకంగా ఉండటంతో ఈసారి కౌలు ధరలు మరింత పెరిగాయన్నారు. మిర్చి సాగు చేసే భూములకు డిమాండ్‌ పెరగడంతో కౌలు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఎకరం భూమి కౌలు రూ.లక్ష పలకడం విశేషం. మార్కెట్‌లో ఏడాది కాలంగా మిర్చికి మంచి ధరలు లభిస్తుండటంతో సాగునీటి లభ్యత ఉన్న భూములకు డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పుడు రైతులంతా మిర్చి సాగు చేయడానికి ఆసక్తి చూపడం కూడా మరో కారణం. పెదకూరపాడు మండలంలో కొందరు ఐటీ- ఇంజినీర్లు కలిసి సమూహంగా ఏర్పడి 50 ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగుకు ముందుకురావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement