నెల్లూరు, ప్రభన్యూస్ : దేశంలో గత కొంతకాలంగా ఆహార ధాన్యాలకు కొరత లేదు. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ రుతుపవనాలైతేనేమీ, వర్షాలు అయితేనేమీ, సరైన సమయంలోనే స్పందిస్తుండడంతో రైతులకు నీటి ఇబ్బంది తక్కువగానే ఉంది. దీంతో 2017 -18లతో పోలిస్తే 2019, 2020, 2021, ప్రస్తుతం 2022లో కూడా నీటి లభ్యత ఎక్కువగానే ఉండడంతో దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ధాన్యం దిగుబడులు అధికంగానే ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఏర్పడి ఉంది. గత సంవత్సరం అత్యంత సమర్థవంతంగా ఎటువంటి విమర్శలు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగానే నడిచింది. చిన్న చిన్న అంతరాయాలు మినహాయించి రైతులు కూడా సంతోషంగానే ధాన్యం అమ్మకాలు చేసుకోగలిగారు. ఈ ప్రక్రియలో ఆర్‌బీకేలు, మిల్లర్లు సమన్వయంగా ముందుకు సాగారు.
మిల్లర్ల మాయాజాలంతో.. మద్దతు ధరకు గండి
ఈ సంవత్సరం రైతులకు అనుకున్నంత రీతిలో మద్దతు ధర అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పుట్టి రూ. 16800 ఏ ఒక్క రైతన్నకు కూడా చెందలేదు. భారీ వర్షాల కారణంగా జిల్లా సీజన్‌లో చాలా మార్పులు జరగడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకమునుపే మార్కెట్‌లోకి ప్రవేశించిన మిల్లర్లు , దళారులు ధాన్యం ధరను అస్తవ్యస్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రకరకాల నిబంధనలతో అమ్ముకోవాల్సి వస్తుందంటూ రైతులకు మాయమాటలు చెప్పి, వడ్డీ లెక్కలతో ఆలస్యం చేస్తే మీకు నష్టమవుతుందంటూ నమ్మించి తక్కువ ధరకే కొనుగోలు ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటై పని ప్రారంభించే లోపే మిల్లర్ల దోపిడీ ప్రారంభం అయిపోయింది. గత సంవత్సరం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకున్న రైతులకు ఆలస్యంగా నగదు చేరిన సంఘటనలు కూడా రైతులు మిల్లర్ల వైపు మొగ్గు చూపేలా చేశాయి. కళ్ల ముందు కట్టాల్సిన అప్పు, వడ్డీలు కదలాడుతుండడంతో వారు కొంచెం ధర తగ్గినా పర్వాలేదు అనుకుంటూ మిల్లర్ల వైపే మొగ్గు చూపారు.
ధాన్యం కొనుగోళ్లలో కూడా నిబంధనలు సడలించాలి
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనల్లో కూడా సడలింపు అవసరమని రైతులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నెమ్ము శాతం విషయంలో మరికొంత సవరణలు చేయాలని , లేని పక్షంలో తమకు నష్టం జరుగుతుందని వారు వాదిస్తున్నారు. పేరుకు పుట్టి 850 కేజీలైనా కూడా మిల్లర్లు నెమ్ము శా తం పేరుతో తమ వద్ద 1000 కేజీలకు పైగా ధాన్యాన్ని తీసుకుంటున్నారని , ఈ విషయంలో వ్యవసాయ అధికారుల జోక్యం తక్కువగా ఉండడంతో తమకు నష్టమే జరిగిందన్నది రైతుల వాదన .
ముందస్తు అంచనాలతో ఎగుమతుల విధానంలో మార్పులు అవసరం..
జిల్లాకు సంబంధించి కృష్ణపట్నం ఓడరేవు గుండా బియ్యం ఎగుమతులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంక , ఆఫ్రికా దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరుగుతున్నాయి . భారత ఆహార విధానం ప్రకారం పాత కాలపు పద్ధతులే ఇప్పటికి కూడా ఎగుమతుల విధానంలో అవలంభిస్తున్నారు. ఈ విషయంలో పలు మార్పులు జరగాల్సి ఉంది. వర్షపాతాన్ని బట్టి సాగుచేసే నేల నిర్ణయం అనేది ముందస్తుగా తెలుస్తుంది. అలాగే ఎంత మేరకు ధాన్యం దిగుబడి రానున్నది అన్నది కూడా రెండు నెలల ముందుగానే తెలుస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం , ప్రజా ప్రతినిధులు మరింత చొరవ తీసుకుని ఎగుమతుల విధానంలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకతపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. ఈ మార్పు, చేర్పులు ప్రతి సీజన్‌లో అంచనా వేసిన ధాన్యం దిగుబడి ప్రకారం జరిగినప్పుడు రైతులకు , మిల్లర్లకు, ఎగుమతి దారులకు కూడా మరింత మంచి జరగడంతో పాటు అధికార యంత్రాంగంపై ఒత్తిడి తగ్గడమే కాకుండా ఓడరేవు ద్వారా ఎగుమతుల వలన కేంద్ర ప్రభుత్వానికి మరింత సెస్ లభించే అవకాశం కూడా కలుగుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..