కృష్ణా జిల్లాలో మొన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. మొన్న స్పాట్లో ఇద్దరు చనిపోగా.. ట్రీట్మెంట్ పొందుతూ ఇవ్వాల ఉదయం మరొకరు చనిపోయినట్టు అధికారులు తెలిపారు.
జి.కొండూరు, (ప్రభ న్యూస్) కృష్ణా జిల్లా జి.కొండూరు మండల పరిధిలోని చెవుటూరు బైపాస్ 30వ నెంబర్ జాతీయ రహదారిపై మొన్న జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం మూడుకు చేరుకుంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అరసళ్లపాడు గ్రామానికి చెందిన రావూరి వెంకటకృష్ణ అనే వ్యక్తి ట్రాక్టర్, బస్సు ఢీకొన్న దుర్ఘటనలో అదే రోజు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇతడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు.
ఈ విషయాన్ని జి.కొండూరు పోలీసులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా విజయవాడ నుండి తిరువూరుకి వెళ్తున్న తిరువూరు డిపోకు చెందిన బస్సు ఏపీఎస్ఆర్టీసీ నిబంధనల ప్రకారం కొత్త బైపాస్ జాతీయ రహదారిపై వెళ్లకూడదు. జి.కొండూరు నుంచి చెవుటూరు గ్రామాలలో నుంచి బస్సును నడపాల్సి ఉంటుంది. కానీ బస్సు డ్రైవర్ మాత్రం జి.కొండూరు నుంచి ఆత్కూరు రోడ్డు మీదుగా కొత్త బైపాస్ రోడ్డుపైకి బస్సును మళ్లించారు. దురదృష్టవశాత్తు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం, వాటి యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి వెరసి మూడు ప్రాణాలను బలి తీసుకున్నాయి. మరికొందరి జీవితాలను అవిటి బతుకులు చేశాయి.