తిరుమల, ప్రభన్యూస్ : భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతుంది. క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్‌లు వెలుపలికి వ్యాపించాయి. శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్ కొద్ది భక్తులు క్యూ లైన్‌లో బారులు తీరారు. దీంతో శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలకు సమయం పడుతుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకే టిటిడి పరిమితం చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం పెద్ద భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఎటుచూసినా భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్‌లో దర్శనమిస్తున్నాయి. శ్రీనివాసుడి దర్శనం కోసం భారీగా భక్తులు క్యూ లైన్‌లలో బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచివుండే వైకుంఠం క్యూ కాంప్లెక్సు 1, 2 లోని కంపార్టు మెంట్లన్నీ పూర్తిగా నిండి క్యూలైన్‌లు వెలుపలికి వచ్చేశాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా భక్తులతో నిండి పోవడంతో వెలుపల ఏర్పాటు చేసిన క్యూ లైన్‌లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
నారాయణగిరి ఉద్యానవనానికి వెలుపల ఏర్పాటు చేసిన క్యూ లైన్‌లలో సుమారు కిలోమీటర్ మేర భక్తులు క్యూ లైన్‌లో వేచివున్నారు. ఇక కాలినడకన భక్తులు ప్రవాహంలా తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం టిటిడి కాలినడకన వచ్చే భక్తులకు జారి చేసే దివ్యదర్శనం టోకెన్ల జారిని టిటిడి నిలిపివేసి ఉండడంతో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో కాలినడక వచ్చే భక్తులంతా కూడా సర్వదర్శనం దర్శనం క్యూ లైన్ గుండానే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉండడంతో సర్వదర్శనం క్యూ లైన్ మరింత పెరుగుతుంది. అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగి ననేపథ్యంలో స్వామివారిని సర్వదర్శనం గుండా దర్శించుకోవాలంటే దాదాపు 15 గంటలకు పైగా సమయం పడుతుంది. భక్తులు దర్శనం కోసం వేచివుండే సమయం భారీగా పెరగడంతో క్యూ లైన్‌లో వేచివుండే భక్తులకు టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు అన్నదానం అధికారులు శ్రీవారి సేవకుల సహాయంలో ఎప్పటిప్పుడు తాగునీరు, అన్నప్రసాదాలు, అల్పాహారం వంటివి అందిస్తున్నారు. ఇక భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో గదులు కేటాయించే కౌంటర్ల వద్ద కూడా భక్తులు భారీగా బారులు తీరారు. అయితే గదులు ఖాళిలు ఏర్పడక పోవడంతో టిటిడి భక్తులకు గదులు కేటాయించలేక పోతుంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటూ టిటిడి ఏర్పాటు చేసిన లాకర్లనుపొంది సేద తీరుతున్నారు. అలాగే ఈ రద్దీ మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..