Wednesday, November 20, 2024

ప్రభుత్వానికి పెరిగిన మద్యం రాబడి.. గతేడాదితో పోలిస్తే రూ.3వేల కోట్లు అదనం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో బెల్టు షాపులు లేవు. పర్మిట్‌ రూములు రద్దు చేశారు. మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు..అమ్మకపు వేళలు కుదించారు. మద్యం రేట్లు చూసి బెంబేలెత్తి మానేయకతప్పదని ప్రభుత్వం చెప్పినా..మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యంపై రాబడి గతేడాది కంటే రూ.3వేల కోట్ల వరకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రెండో ఆదాయ వనరుగా ఉన్న ఆబ్కారీశాఖ ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మద్యంపై రూ.28,093 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయంతో పాటు అమ్మకాలు కూడా భారీగా పెరగడం విశేషం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. దశలవారీ మద్య నిషేధం అమలులో భాగంగా మద్య వినియోగం తగ్గించేందుకు ఆస్కారం ఉన్న అన్ని రకాల చర్యలను ప్రభుత్వం చేపట్టింది.

తొలి రోజుల్లోనే రాష్ట్రంలోని 42వేల బెల్టు షాపులను అధికారులు కట్టడి చేశారు. అప్పటికే ప్రైవేటు మద్యం షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్‌ రూములను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో పాటు ప్రైవేటు నిర్వహణలోని మద్యం షాపులను ఏపీబీసీఎల్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 33శాతం వరకు తగ్గించి 2,934 కుదించింది. గతంలో మద్యం షాపుల అమ్మకాలు ఉదయం 10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు తెరిచి ఉంచేవారు. ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన వెంటనే షాపుల అమ్మకపు వేళలను ఉదయం 11గంటల నుంచి మూడు గంటల తగ్గిస్తూ రాత్రి 9గంటల వరకే పరిమితం చేసింది.

కొత్త బార్‌ విధానంలో బార్ల సంఖ్యను యదాతధంగా ఉంచింది. గతంలో 840 మద్యం షాపులు ఉండగా 2023-25 కాలానికి అదే సంఖ్యతో బార్లను బహిరంగ వేళం ద్వారా లైసెన్స్‌లు మంజూరు చేశారు. మద్య వినియోగం తగ్గించేందుకు ఉన్న అన్ని ప్రత్యమ్నాయ పద్దతులు వినియోగించినప్పటికీ..గతంతో పోల్చితే అమ్మకాలతో పాటు ఆదాయం కూడా పెరిగింది. ఇప్పటి వరకు అధికారులు రేట్ల పెంపుతో ఆదాయం పెరిగినట్లు చెపుతున్నప్పటికీ..అమ్మకాలు కూడా పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి..

- Advertisement -

రేట్ల బాదుడు..

రాష్ట్రంలో మద్యం రేట్లను ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచింది. పాత పాలసీలో రూ.120 ఉన్న క్వార్టర్‌ నిబ్‌(180ఎంఎల్‌) ఇప్పుడు రూ.240కి చేరుకుంది. పాత మద్యం పాలసీలో చీఫ్‌ లిక్కర్‌ రూ.80కి 180 ఎంఎల్‌ నిబ్‌ దొరికితే ఇప్పుడది రూ.180గా ఉంది. దిగువశ్రేణి చీఫ్‌ లిక్కర్‌, మీడియం బ్రాండ్ల రేట్లు వంద శాతం మేర పెరిగాయి. మద్యం షాపులతో పోల్చితే బార్లలో మరింతెక్కువగా రేట్లు ఉన్నాయి. ప్రభుత్వం వివిధ పన్నుల రూపంలో బార్లలోని మద్యం అమ్మకాలపై ఆదాయం ఆర్జిస్తోంది. ఇదే క్రమంలో అదనపు రిటైల్‌ ఎక్సైజు టాక్స్‌(ఎఆర్‌ ఇటీ) పేరిట 20శాతం వరకు బార్లలో జరిగే అమ్మకాలపై విధించింది. ఇది కాక ఎక్సైజు సుంకం, అదనపు ఎక్సైజు టాక్స్‌, లైసెన్స్‌ రుసుము..ఇలా రకరకాల పన్నుల రూపంలో మద్యంపై గణనీయమైన ఆదాయం వస్తోంది. ఉన్నతాధికారులు ప్రతిసారీ ఆదాయం అధికంగా రావడం వెనుక మద్యం రేట్ల పెంపు అని చెపుతున్నారు. అధికారులు ఆశించిన దానికి ఏ మాత్రం తగ్గని రీతిలో మద్యంపై ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.

పెరిగిన అమ్మకాలు..

గత ఏడాదితో పోల్చితే మద్యం అమ్మకాలు భారీగానే పెరిగాయి. గత ఏడాది ఐఎంఎఫ్‌ఎల్‌(ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌) రెండు కోట్ల 63లక్షల 72వేల,713 కేసులు, బీర్లు 81లక్షల 53వేల 607 కేసులు అమ్ముడుపోగా ప్రభుత్వానికి రూ.25వేల 23 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇదే ఈ ఏడాది మూడు కోట్ల ఎనిమిది లక్షల 20వేల ఐఎంఎఫ్‌ఎల్‌, లక్షా 69వేల 800 కేసుల బీర్లు అమ్ముడు పోగా ప్రభుత్వానికి రూ.28వేల 94 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోటి 87లక్షల 59వేల 131 ఐఎంఎఫ్‌ఎల్‌, 57వేల 653 కేసుల బీర్లు అమ్మగా ప్రభుత్వానికి రూ.20వేల 190 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇదే 2019-20 ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల 8లక్షల 50వేల, 764 ఐఎంఎఫ్‌ఎల్‌, రెండు కోట్ల 12లక్షల 91వేల 376 బీర్ల కేసులు అమ్మగా ప్రభుత్వానికి రూ.20వేల 128 కోట్ల ఆదాయం వచ్చింది. ఎన్నికల ఏడాది కావడంతో ఈ ఏడాది మరింత పెద్ద ఎత్తున అమ్మకాలు చోటు చేసుకొని ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

క్రమేపీ పెరుగుతున్న అమ్మకాలు..

గత నాలుగేళ్లతో పోల్చితే మొదట్లో అధికారులు అమ్మకాలను గణనీయంగా తగ్గించారు. పైగా కోవిడ్‌ కూడా అమ్మకాలు తగ్గేందుకు కారణమైంది. ఈ క్రమంలోనే గతంలో మాదిరి అమ్మకాలు పెరిగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆదాయంలో రెండో స్థానం ఆక్రమించి మద్యం అమ్మకాలను తగ్గిస్తే సంక్షేమ పథకాలకు గండిపడుతుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఏటా అమ్మకాల పెంపుకు చర్యలు చేపట్టారు. అమ్మకాలు తగ్గితే కారణాలపై తరుచూ సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా పెంచేందుకు చర్యలు తీసుకుంఉటన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement