Saturday, November 23, 2024

AP | అసంపూర్తిగా ‘‘నాడు-నేడు’’ ఫేజ్‌- 2.. ప్రభుత్వ ఆశయానికి తూట్లు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘నాడు – నేడు’’ పనులు నత్తడకన సాగుతున్నాయి. ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పాఠశాలలోని విద్యార్ధులు తరగతి గదులు, మౌళిక వసతులు లేక ఇబ్బందులు పడకూడదన్న ఉద్ధేశంతో నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందాన సాగుతున్నాయి. నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ఫేజ్‌ – 2 కింద పనులు ప్రారంభించి దాదాపు18 నెలలు గడుస్తున్నా నేటికీ పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసుకున్న పాఠశాలలు శూన్యం.

ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తూ నేరుగా పాఠశాల బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేస్తోంది. కానీ నిధుల వినియోగంలో అధికారులు విడతల వారీగా జారీ చేస్తున్న ఉత్తర్వులు ప్రధానోపాధ్యాయులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఫేజ్‌- 2 కింద ప్రారంభంలో నిధులను విడుదల చేసినప్పటికీ పదోన్నతులు, ట్రాన్స్‌ఫర్‌లు రావడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు మరొక చోటకు వెళ్ళడం వంటి సాకులతో నాడు – నేడు ఫేజ్‌ – 2 పనులను గాలికొదిలేశారు.

ప్రారంభ దశ నుండే పనులను నత్తనడకన నిర్లక్ష్యంగా చేపట్టడం, నిధుల వినియోగంలో గందరగోళం వెరసి ఫేజ్‌- 2 కింద ఎంపికయిన పాఠశాలలు తరగతుల నిర్మాణానికి నోచుకోక కొన్ని చోట్ల పునాదులు, మరి కొన్ని చోట్ల మొండి గోడలు దర్శనమిసున్నాయి. విద్యార్ధులు మాత్రం తరగతి గదులు లేక అనేక అవస్థలు పడుతున్నారు.

నిధులు దుర్వినియోగం కాకూడదనే….

- Advertisement -

గతంలో అదనపు తరగతి గదుల మరమ్మతులు, నిర్మాణం చేపట్టాలంటే టెండర్‌లు ప్రకటించి పనులు కాంట్రాక్టర్‌కు అప్పగించాల్సి ఉండేది. ఇలా అప్పగించడం వల్ల ఆయా కమీషన్ల రూపంలో విడుదల చేసిన నిధులలో 50 శాతం కాంట్రాక్టర్‌కు వెళుతుండటం, నాణ్యత లోపించడం వల్ల ప్రభుత్వ నిధులు బారీగా దురినియోగం జరుగుతుందని వైసీపీ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికింది.

పాఠశాల పేరెంట్స్‌ కమిటీ, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులను భాగస్వాములను చేస్తూ నిర్మాణ పనులను అప్పగించింది. సీఆర్పీలు, ఎంఈవో, సమ్రగ శిక్ష, ఆర్‌డబూ్య్లస్‌, పంచాయితీ రాజ్‌, సచివాలయ ఉద్యోగులను పనులలో బాద్యులను చేస్తూ నిర్మాణ నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆదేశాలను జారీ చేసింది. నిధులను నేరుగా పాఠశాలకి చెందిన బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది. నిధులను ఖర్చు పెట్టి పనులు చేపట్టిన అనంతరం మరలా విడతల వారీగా బ్యాంకు ఖాతాకు జమ చేస్తున్నారు.

ఫేజ్‌- 2 కింద 22 వేల పాఠశాలలు ఎంపిక:

ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్ధులకు మెరుగైన వసతులు కల్పించి కార్పోరేట్‌ తరహాలో ఆధునీకరించడానికి ముఖ్యమం త్రి జగన్మోహనరెడ్డి నాడు – నేడు పథకానికి శ్రీ కారం చుట్టారు. రాష్ట్రంలో 44 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఈ పథకంలో భాగంగా 2020-21 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో త్రాగునీరు, విద్యుత్‌, డ్రైయినేజీ వంటి తొమ్మిది రకాలైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఫేజ్‌ – 1 కింద పేజీ 15,713 పాఠశాలలను ఎంపిక చేశారు.

వీటికి అంచనా వ్యయం రూ 3996 కోట్లు కాగా రూ 3834 కోట్లు నిధులు ఖర్చు చేసి పనులు పూర్తి చేశారు. ఆ తదుపరి పాఠశాలలకు అతి ముఖ్యమైన తరగతి గదుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. విద్యార్ధుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు ఉండాలనే పట్టుదలతో ఫేజ్‌ – 2 కింద నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో భాగంగా రాష్ట్ర వాప్తంగా 22,229 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటి నిర్మాణానికి రూ 8 వేల కోట్ల వ్యయాన్ని అంచనా వేసి విడతల వారీగా నిధులు మంజూరు చేస్తున్నారు. నేటి వరకు రూ 3,060 కోట్లు ఫేజ్‌ – 2 కింద ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఒక్క పాఠశాలలో కూడా తరగతి గదుల నిర్మాణ ం పూర్తయ్యి ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం

ఫేజ్‌- 2 ప్రారంభించి 18 నెలలు…

నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ఫేజ్‌ – 2 కింద పనులు ప్రారంభమయ్యి 18 నెలలు గడుస్తుంది. నేటికీ ఒక్క పాఠశాలలో కూడా తరగతి గదులు పూర్తయ్యి ప్రారంభానికి నోచుకున్న దాఖలాలు లేవు. దీనివల్ల విద్యార్ధులు తరగతి గదులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఇరుకు గదులలో కూర్చొని, మరికొన్ని చోట్ల పాఠశాల వరండాలో కూర్చొని పాఠాలు వినాల్సి వస్తుంది.

కొన్ని ప్రాంతాలలోని పాఠశాలల్లో స్లాబు దశలో పనులు సాగుతుండగా మరికొన్ని చోట్ల పునాది దశలోనె పనులు నిలిచివడం శోచనీయం. అత్యధిక పాఠశాలల్లో పనులు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే అదనపు తరగతి గదులు ఉన్నా ప్రభుత్వం సూచించిన త్రాగునీరు, విద్యుత్‌ వంటి తొమ్మిది సౌఖర్యాలు లేని పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మౌళిక వసతులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా వాటి ఏర్పాటుకు నోచుకోలేదు.

అధికారులు శ్రద్దపెట్టాలి…

ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో చేపట్టిన బదిలీలు, ప్రమోషన్‌లు, రిటైర్మెంట్‌ వంటి కారణాల వల్ల కొందరు ఉపాధ్యాయులు బాధ్యతల నుంచి మారడం వల్ల అదనపు తరగతుల నిర్మాణ పనులు ఆలస్యమవ్వడానికి కారణంగా కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

తాజాగా అక్టోబర్‌ నెలలో విడుదల చేసిన ఎస్‌ఎమ్‌ఎఫ్‌ గ్రాంటుల నుండి కొత్త కట్టడాలను చేపట్టవద్దంటూ అధికారులు ఉత్తర్వులను జారీ చేయడం ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను విద్యార్ధులకు సౌఖర్యవంతంగా అమలు చేస్తూ పాఠశాల అభివృద్ధికి బాధ్యతవహించాల్సిన ఎంఈవోలు, ఇంజనీర్లు ఇతర అధికారులు దీనిపై క్షేత్రసాయిలో సరైనటువంటి శ్రద్దపెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

క్షేతస్థాయిలో పనులను పరిశీలించకుండా జిల్లా స్థాయిలో నాడు – నేడు కింద నెలకు ఒకసారి రివ్యూలు నిర్వహించడం, ఎక్స్పెండీచర్‌ పెంచాలంటూ ప్రధానోపాధ్యాయులకు మెసేజ్‌లు పంపించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనులు పూర్తి చేయకపోవడానికి గల కారణాలు, సమస్యలను సమగ్రంగా గురించి సక్రమంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లైతే నాడు – నేడు కింద పనులు పూర్తయ్యి అనేక పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభానికి నోచుకునేవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement