Wednesday, November 20, 2024

Big story : ఆదాయమే లక్ష్యం… పర్యాటకమే మార్గం

ప్రభన్యూస్‌ బ్యూరో : పంచుడు పథకాలకు డబ్బులు కావాలి…. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాలి…. ఇవన్నీ జరగాలంటే డబ్బులు కావాలి…. అందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంచుకున్న మార్గం పర్యాటకం. 972 కిలోమీటర్ల తీర రేఖతో దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరం ఏపీ సొంతం. తిరుపతి నుంచి మొదలు పెడితే విశాఖ లంబసింగి వరకు అన్ని పర్యాటక ప్రాంతాలే. వీటి ద్వారా గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు 24 కోట్ల రాబడి ప్రభుత్వం సంపాదించింది. కేవలం రాష్ట్రం ద్వారానే ఇంత ఆదాయం ఉంటే దేశంలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు సంబంధించి ప్యాకేజీ అమలు చేస్తే మరింత ఆదాయం వస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆ శాఖకు చెందిన అధికారులు వివిధ రాష్ట్రాల్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే కనుక అమల్లోకి వస్తే దేశాల్లోని సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించే వీలు కలుగుతుంది. అది కూడా చౌక ధరలో..

హైదరాబాద్‌ ముంబై నుంచి తిరుపతికి విమాన టూర్‌ ప్యాకేజీ..

ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ జాతీయ టూర్‌ ప్యాకేజీలు ప్రకటిస్తోంది. అది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు 24 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో తిరుపతి ప్యాకేజీ నుంచే అత్యధికంగా …18 కోట్ల వరకు రాబడి వచ్చింది. డిసెంబర్లోనే …నాలుగు కోట్ల వరకు ఆదాయం వచ్చింది ఆ తర్వాత విశాఖ లోకల్‌ టూర్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది మరోవైపు కార్తీకమాసంలో శైవ క్షేత్రాలు, శక్తి పీఠాల ప్యాకేజీల ద్వారా ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర పర్యటకశాఖ 35 టూర్‌ ప్యాకేజీలను నిర్వహిస్తోంది. 30 సొంత బస్సుల ద్వారా పర్యాటకులకు సేవలందిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌ ముంబై వంటి కాస్మో పాలిటన్‌ నగరాల నుంచి తిరుపతికి విమాన ప్యాకేజీని అందుబాటు-లోకి తెచ్చింది. ” గ్రాండ్‌ కేనియన్‌ ఆఫ్‌ ఇండియా ” గా పిలిచే గండికోటకు బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి పర్యాటకుల రాకను ప్రోత్సహిస్తోంది.

ఇతర రాష్ట్రాల్ల్రో సైతం..

కేరళ.. దేశంలోనే అత్యధికంగా పర్యాటక ఆదాయాన్ని పొందే రాష్ట్రం. తర్వాతి స్థానంలో గోవా, సిక్కిం, మణిపూర్‌ ఉన్నాయి. ఈ ప్రాంతాలకు ఇతర రాష్ట్రాల్ర నగరాలతో కనెక్టివిటీ- ఉంది. అందువల్లే వాటికి గణనీయంగా ఆదాయం లభిస్తున్నది. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల్ర ప్రాంతాలతో రాష్ట్ర పర్యాటక అధికారులు ఒక ఒప్పందం కుదుర్చుకునే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇక్కడి నుంచే దేశంలోనే వివిధ ప్రాంతాలకు ప్యాకేజీని అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనివల్ల మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందెందుకు అవకాశం ఉంటుందని పర్యాటకశాఖ అధికారులు అంటున్నారు. పనిలో పనిగా రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రచారాన్ని చేపడుతున్నారు. లోకల్‌ టూరిజానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. విశాఖపట్నం- లంబసింగి, విశాఖపట్నం -అరసవిల్లి దేవాలయం, రాజమండ్రి, మారేడుమిల్లి, కర్నూలు – శ్రీకాకుళం, నంద్యాల – శ్రీకాకుళంలోని అరసవిల్లి, శ్రీకూర్మం, శాలిగుండం, కళింగపట్నం ఒక్కరోజులో చుట్టివచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అలాగే సర్క్యూట్‌ టూరిజంలో భాగంగా అనంతపురం, కదిరి, వేమన గారి జన్మస్థలం, గండి ఆంజనేయ స్వామి దేవాలయం, గండికోట, బెలూం గుహలు, తాడిపత్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం తో కలిపి రెండు రోజుల ప్యాకేజీని అమలు చేస్తున్నారు. పర్యాటక శాఖ సిబ్బంది జీతాలు, రవాణా ఖర్చులు అన్ని పోనూ నికరంగా …ఆరు కోట్లకు పైగా ఆదాయం పర్యాటకశాఖ కు లభించింది. ఒకవేళ ఇదే విధానాన్ని దేశవ్యాప్త టూరిజం సర్క్యూట్‌ గా అమలు చేస్తే మరింత ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఆ రాష్ట్ర ప్రజలు కూడా ఏపీలోని వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతుండడంతో మధ్యే మార్గంగా ఎంఓయూలు కుదుర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ గనుక ఇదే అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ దర్శనీయ ప్రాంతాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యాటకులు వీక్షించే అవకాశం కలుగుతుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement