ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వరదల కారణంగా నగరంలోని చాలా ప్రాతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్లు కాలువల్లా మారగా.. కాలనీలు కుంటలను తలపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుపతి నగరం అతలాకుతలమైంది. కొండ పైనుంచి వచ్చిన వరద ప్రవాహం తిరుపతిని ముంచేసింది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నీ మునిగాయి. శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోకి వరద చేరింది. రైల్వే అండర్‌బ్రిడ్జిల వద్ద భారీగా నీరు చేరడంతో మూసేసి ట్రాఫిక్ మళ్లించారు. ముంపు కాలనీల్లో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
తిరుపలిలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. ముత్యాలరెడ్డిపల్లె ప్రాంతంలో సుమారు 500 కుటుంబాలకు పైగా వరద నీటిలో చిక్కుకున్నాయి. బయటికి అడుగు పెట్టలేని స్థితిలో ఉన్నాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అక్కడ పర్యటించి.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం అందించారు.
మరోవైపు తిరుమలకు వెళ్లే శ్రీవారి నడకమార్గం పూర్తిగా ధ్వంసమైంది. కొండ పైనుంచి వచ్చిన వరదపోటుతో మార్గం పూర్తిగా కొట్టుకుపోయింది. కొండపై నుంచి కొట్టుకువచ్చిన పెద్దపెద్ద బండరాళ్లు, బురదతో మార్గమంతా నిండిపోయింది. తిరుగిరుల్లోని జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి కిందికి వరద ఉద్ధృతంగా వస్తోంది. కొండపైన అన్ని మార్గాలూ నీట మునిగాయి. వానలతో యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital