Saturday, November 23, 2024

Big Story: వంట నూనె ధరల్లో దొంగాట.. అక్రమార్కులను వదిలేసి, అమాయకులపై దాడులు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపధ్యంలో చమురు ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఆ ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. అయితే ధరల నియంత్రణ ముసుగులో కొంతమంది అధికారులు అసలు దొంగలను వదిలేసి హోల్‌సేల్‌ వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. నిత్యం తనిఖీలు, దాడులు, కేసుల పేరుతో వారిని వేధింపులకు గురి చేస్తున్నట్లు వ్యాపార వర్గాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఆయిల్‌ ధరలను అమాంతంగా పెంచి ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్న వ్యాపారులను వదిలేసి ప్రభుత్వం నిర్ణయించిన ధర (ఎం.ఆర్‌.పి) కంటే తక్కువగా అమ్మకాలు సాగిస్తున్నా హోల్‌సేల్‌ వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. గడిచిన వారం పదిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దాడుల్లో ఎక్కువ శాతం హోల్‌సేల్‌ వ్యాపారులపైనే జరుగుతున్నాయి. వాస్తవానికి వారంతా ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిత్యం ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ట్యాక్స్‌లు చెల్లిస్తూ హోల్‌సేల్‌గా ఆయిల్‌ అమ్మకాలను సాగిస్తున్నారు. అయినా కొంతమంది అధికారులు నిబంధనలు పాటిస్తున్న వ్యాపార సంస్థలపై దాడులు చేస్తున్నారు. దాడుల సమయంలో అన్ని రికార్డులు పూర్తి స్థాయిలో ఉన్నా కూడా ధరల బోర్డు లేదంటూ చిన్నచిన్న లోపాలను బూతద్దంలో చూస్తూ పెద్ద కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో పలువురు హోల్‌సేల్‌ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే తమ వ్యాపారాలు ఎలా చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు.

ట్యాక్స్‌ కడుతున్నా..వేధింపులే..!

కృష్ణపట్నం ఓడరేవు నుండి నిత్యం 250కు పైగా ఆయిల్‌ ట్యాంకర్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు సన్‌ప్లవర్‌, పామాయిల్‌ సరఫరా అవుతుంది. ఒక్కో ట్యాంకర్‌ ఖరీదు రూ.50 లక్షలు. అంటే రోజుకు సుమారు 125 కోట్ల రూపాయల విలువైన ఆయిల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. 5 శాతం ట్యాక్స్‌తో ప్రభుత్వానికి నిత్యం రూ.6.50 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నెలకు రూ.180 కోట్లకు పైగా వ్యాపారులు ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తున్నారు. అందుకు సంబంధించి ట్యాక్స్‌తో పాటు అనుమతులు తీసుకున్న తర్వాత పోర్టు నుంచి ఆయిల్‌ ట్యాంకర్‌ ఆయా జిల్లాలకు సరఫరా చేస్తాయి. అందుకు ప్రత్యేక తనిఖీ బృందం కూడా పోర్టు ప్రాంగణంలో నిత్యం నిఘా ఉంచుతుంది. ప్రభుత్వానికి ఇంత పెద్ద మొత్తంలో ట్యాక్స్‌ల రూపంలో ఆదాయాన్ని అందిస్తున్నా హోల్‌సేల్‌ వ్యాపారులపై మాత్రం స్థానిక అధికారులు ధరల నియంత్రణ పేరుతో దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఆయిల్‌ ప్యాకెట్ల వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది. నిత్యం పోర్టు నుంచి 18 వేల ప్యాకెట్లు సామర్ధ్యం కలిగిన లారీలు పదుల సంఖ్యలో రాష్ట్ర నలుమూలలకు సన్‌ప్లవర్‌, పామాయిల్‌ ప్యాకెట్లను వివిధ కంపెనీలు హోల్‌సేల్‌ రూపంలో సరఫరా చేస్తుంటాయి. అందుకు సంబంధించి కూడా ట్యాక్ప్‌లను ఆయా కంపెనీలు ప్రభుత్వానికి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాయి. ఇలా ఆయా కంపెనీలతో పాటు హోల్‌సేవల్‌ వ్యాపారులు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన అనుమతులు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను క్రమం తప్పకుండా చెల్లిస్తూ, ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని అందిస్తున్నారు.

అంత చేస్తున్నా వారిపై మాత్రం క్షేత్ర స్థాయిలో వేధింపులు మాత్రం తగ్గడం లేదు. అధిక ధరలు, శాంపిల్స్‌ పేరుతో..హోల్‌సేల్‌ వ్యాపారులపై ఒత్తిడిలు వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా అయిల్‌ ధరలు చుక్కలంటుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఎంఆర్‌పి ధరలకు విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకు భిన్నంగా ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. సాధారణంగా వంట నూనెల ధరలను అదుపులో ఉంచేందుకు, నాణ్యతను పరిశీలించేందుకు ఇప్పటివరకు విజిలెన్స్‌, డీఎస్‌వోలు పనిచేస్తూ వస్తున్నారు. తాజాగా స్థానికంగా రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు కూడా కొత్తగా బాధ్యతలను అప్పగించారు. స్థానిక అధికారులు అధిక ధరలు, శాంపిల్స్‌ పేరుతో హోల్‌సేల్‌ వ్యాపార సంస్థలపై దాడులు చేస్తూ వ్యాపారులను హడలెత్తిస్తున్నారు. ఎంఆర్‌పి ధరల కంటే రూ.10 తక్కువగానే విక్రయిస్తున్నప్పటికీ బోర్డులు లేవని కుంటి సాకులు చూపుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధికారుల దాడులపై రాష్ట్రవ్యాప్తంగా హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి నిరసన వ్యక్తమవుతుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తూ నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న తమపై దాడులు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా అధిక ధరలకు విక్రయించే వ్యాపారులను వదిలేసి ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఆ దిశగా వ్యాపారాలు సాగిస్తున్న తమపై కొంతమంది అధికారులు పనికట్టుకుని దాడుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని పలువురు వ్యాపారాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement