అమరావతి, ఆంధ్రప్రభ:ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనకు జగన్మోహన రెడ్డి ప్రభుత్వం తెరదించింది. పదోన్నతుల్లో పాత విధానం అమలుకు ప్రభుత్వం అంగీకరించింది. విలీనానికి ముందు నియామకం పొందిన వారికి పాత నిబంధనల మేరకే పదోన్నతులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత నియామకాలకే ప్రభుత్వ నిబంధనలు వర్తించేలా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. గత కొంత కాలంగా పదోన్నతులపై ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.
ఆర్టీసీ యాజమాన్యంలో నియమితులైన తమకు ప్రభుత్వ సర్వీసు నిబంధనలు వర్తింప చేస్తూ పదోన్నతులు ఇస్తే నష్టం చేకూరుతుందనేది వీరి అభిప్రాయం. ఆర్టీసీ యాజమాన్యంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా విద్యార్హతలను నిర్ణయించి నియామకాలు చేపట్టారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు.
2020 జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. వీరి కోసం రాష్ట్ర రవాణాశాఖలో ప్రజా రవాణా శాఖ(పీటీడీ)ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సర్వీసు నిబంధనలు, ప్రయోజనాలు ఆర్టీసీ ఉద్యోగులకు సైతం వర్తించేలా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘనల్లో సైతం ప్రభుత్వ మార్గదర్శకాలే వీరికి వర్తించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న 70శాతం మంది పదోన్నతుల్లో నష్టపోతారు. ఉద్యోగుల ఆందోళనల నేపధ్యంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు పాత విధానంలోనే పదోన్నతులు ఇవ్వాలంటూ ప్రభుత్వం దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వివిధ సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో పాత విధానంలోనే పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు చెపుతున్నారు.
పదోన్నతులు ఇలా..
ఆర్టీసీ ఉద్యోగులకు రెండు కేటగిరీల్లో పదోన్నతులు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించారు. 2019 డిసెంబర్ 31లోపు ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు గతంలో అమలు చేసిన ఆర్టీసీ సర్వీస్ నిబంధనలనే వర్తింపచేయనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాక విధుల్లో చేరినవారికి ప్రభుత్వ సర్వీసు నిబంధనలను అమలు చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పీటీడీ సర్వీసు నిబంధనల్లోని సెక్షన్ 5ను సవరించనుంది.
ఇందులో భాగంగా గతంలోనే ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ సవరణ బిల్లును సైతం ఆమోదించింది. తొందరలోనే పదోన్నతులకు సంబంధించి విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వపరంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఆర్టీసీలో 2019 డిసెంబర్ 31లోపు ఉన్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు వంటివి ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకే కల్పిస్తారు.
ఆర్టీసీలో ప్రత్యేక నిబంధనలు..
గతంలో ఆర్టీసీలో ఉద్యోగులుగా నియమితులైవారికి పదోన్నతులకు సంబంధించి విద్యార్హతల నిబంధనలు ప్రత్యేకంగా ఉండేవి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలనే వర్తింప చేస్తున్నారు. ఆర్టీసీలో తక్కువ విద్యార్హతతో ఉద్యోగాలు పొందడం ద్వారా పదోన్నతులకు అర్హత కలిగిన ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలతో నష్టపోతామనే ఆందోళకు గురవుతున్నారు. ఇదే అభిప్రాయన్ని పలు ఉద్యోగ సంఘాలు సైతం వ్యక్తం చేశాయి.
ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన పలు సమావేశాల్లో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ దృష్టికి సైతం ఉద్యోగ సంఘాల నేతలు తీసుకెళ్లారు. ఆయా సమావేశాల్లో రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. అధికారుల హామీ ఇచ్చిన మేరకు ఇప్పుడీ కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.
50వేల మందికి ప్రయోజనం..
ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న 50వేల మంది వరకు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. వీరంతా పాత నిబంధనల మేరకే పదోన్నతులు పొందుతారు. విలీనం చేసేనాటికి ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నవారికి ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించనున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సర్వీసులో చేరిన వారికి ప్రభుత్వ నిబంధనలే వర్తింప చేయనున్నారు. అధికార వర్గాల సమాచారం మేరకు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం తర్వాత 350 మంది లోపే సర్వీసులో చేరినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో వీరికి పదోన్నుతలు ఇస్తే ప్రభుత్వ సర్వీసు నిబంధనలే వర్తిస్తాయి. ప్రభుత్వ నిర్ణయంపై అటు ఉద్యోగులు, ఇటు ఉద్యోగ సంఘాల నేతలు హర్షం ప్రకటిస్తున్నారు.