Monday, September 23, 2024

AP: ఆ బంగారు ఉంగరం చోరీ కేసులో…

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : దాదాపు పది నెలల క్రితం ఒక రెస్టారెంట్ లో అదృశ్యమైన బంగారు ఉంగరం కేసులో జోక్యం చేసుకున్న కోర్టు ఒక పోలీసు ఉన్నంతధికారిపై నిందితుడిగా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన అరుదైన ఉదంతం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. విలువైన ఆ ఉంగరం ప్రస్తుత అధికార పార్టీకి చెందిన వ్యక్తి ది కావడం, పైగా ఆ ఉంగరంపై చంద్రబాబు, లోకేష్ ల ఫోటోలు ఉండడం మొదలైన విషయాలు సంచలన చర్చనీయాంశాలవుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం నాయకుడైన జయరామిరెడ్డి అనే వ్యక్తి గత ఏడాది సెప్టెంబర్ నెలలో స్థానిక ఎయిర్ బై పాస్ రోడ్డులోని ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ టేబుల్ పైన తన చేతికి ఉన్న 30గ్రాముల బంగారు ఉంగరాన్ని పెట్టి మరచిపోయి వెళ్లిపోయారు. మరుసటిరోజు రెస్టారెంట్ కు వెళ్లి అడుగగా ఆ విలువైన ఉంగరం వేట మొదలైంది. అక్కడే పనిచేసే ఒక కార్మికుడు ఆ ఉంగరాన్ని తీసుకోవడం సీసీ కెమెరా ఫుటెజ్ లో కనిపించింది. అతడిని విచారించగా తీసుకున్న మాట నిజమేనని చంద్రబాబు, లోకేష్ బొమ్మలతో రాళ్ళను పొదిగిన ఉంగరం పై రాళ్ళను చూసి నకిలీ అనుకుని చెత్తకుండిలో పడవేసినట్టు చెప్పాడు. ఆ విధంగా ఆ ఉంగరం మునిసిపల్ చెత్త బండిలో వెళ్ళిపోయినట్టు తేలింది.

దానిపై జయరామిరెడ్డి ఫిర్యాదు చేయగా.. ఈస్ట్ పోలీసులు ఆ కార్మికుడిని పిలిపించి మూడు రోజులు విచారించినా ఫలితం లేకపోగా వదిలివేశారు. పోలీసుల నిర్లక్ష్యంపై జయరామిరెడ్డి పోలీసు శాఖ స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసారు. కానీ ఫలితం కనిపించక పోవడంతో తన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదని, ఆధారాలతో నిందితుడిని పట్టిచ్చినా వదిలేశారని, అదేమని ప్రశ్నిస్తే చంద్రబాబు, లోకేష్ ఫోటోలు ఉన్నాయి కనుక పట్టించుకోలేదని, ఎవరు కేసు నమోదు చేస్తారంటూ సీఐ మహేశ్వర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ జయరామిరెడ్డి కోర్టులో ప్రైవేటు కేసు నమోదు చేసారు. ఆ కేసును నమోదు చేయకపోవడంతో పాటు నిందితున్ని వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ మహేశ్వర్ రెడ్డిని ఏ2 గా కేసులో చేర్చాలని కోర్టు గత వారం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

కాగా గత జనవరి నెలలోనే (క్రైమ్ నెం 9/24 u /sec 379 ఐపీసీ కింద) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, తాను ఎవరిపైన వ్యాఖ్యలు చేయలేదని ఈస్ట్ సీఐ మహేశ్వర రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ అంశాలను కోర్టుకు తెలియజేయడానికి పోలీసు శాఖ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్త‌మ్మీద‌ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టడంతో పాటు పోయిన ఉంగరంపై చంద్రబాబు, లోకేష్ ల బొమ్మలు ఉండడం, ఆ ఉంగరం తెలుగుదేశం పార్టీ నాయకుడిది కావడం, సంబంధిత కేసులో ఒక సీఐని నిందితుడుగా చేయాలని కోర్టు ఆదేశించడం మొదలైన అంశాలు ఒక బంగారు ఉంగరం అదృశ్యం కేసును సంచలన చర్చనీయాంశంగా మార్చి వేసాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement